How To Find A Lost Or Stolen Phone In 2023 : స్మార్ట్‌ఫోన్ అనేది నేడు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన ప్రతి పనిని చాలా సులువుగా చేసుకోవడానికి, ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. మరి ఇంత విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఒక వేళ పొరపాటున పోగొట్టుకుంటే? లేదా ఎవరైనా దొంగిలించి ఉంటే.. పరిస్థితి ఏమిటి?
టెక్నాలజీతో కనిపెట్టవచ్చు గురూ!
How To Find Lost Phone With Google Account : స్మార్ట్‌గా ఆలోచిస్తే.. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పోయిన/ దొంగతనానికి గురైన ఫోన్‌ను సులువుగా కనిపెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు.. ఫోన్ కొనేటప్పుడే గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యుంటారు. కనుక అదే మెయిల్ ఐడీతో.. మీ స్మార్ట్‌ఫోన్‌ను సులువుగా కనిపెట్టవచ్చు. ఇందుకోసం..
- ముందుగా మీరు https://www.google.com/android/find/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- మీ మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
- అక్కడ మీరు ఉపయోగించే అన్ని డివైజ్‌ల లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీరు ఏ ఫోన్‌ను కనిపెట్టాలని అనుకుంటున్నారో.. దానిని ఎంచుకోవాలి. వెంటనే మీ ఫోన్ ఏ లొకేషన్లో ఉందో కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడే మీ ఫోన్ బ్యాటరీ లెవెల్ ఎంత ఉందో కూడా కనిపిస్తుంది. అలాగే అది ఏ వైఫైతో కనెక్ట్ అయ్యుందో కూడా చూపిస్తుంది.
- అదే స్క్రీన్‌లో మీకు Play Sound, Secure Device, Erase Device అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.
- మీరు కనుక Play Sound ఆప్షన్‌ను క్లిక్ చేస్తే.. ఫోన్ సైలెంట్లో ఉన్నప్పటికీ.. 5 నిమిషాల పాటు అది బయటకు వినిపించేలా రింగ్ అవుతూనే (మోగుతూనే) ఉంటుంది. మీరు కనుక సమీపంలోనే ఉంటే.. దానిని సులువుగా కనిపెట్టవచ్చు.
- మీరు కనుక Secure Device ఆప్షన్ ఎంచుకుంటే, మీ ఫోన్‌కు ఒక మెసేజ్ పంపించడానికి లేదా మీ కాంటాక్ట్ డీటైల్స్ పంపించడానికి వీలవుతుంది. దీని వల్ల.. ఎవరికైనా మీ ఫోన్ దొరికి ఉంటే.. వాళ్లు మీ డీటైల్స్ తెలుసుకుని.. మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఏర్పడుతుంది.
- ఒక వేళ ఎవరైనా మీ ఫోన్‌ను దొంగిలించి ఉంటే.. అందులోని విలువైన, సున్నితమైన డేటాను వాళ్లు తస్కరించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ ఫోన్ కచ్చితంగా దొంగతనానికి గురైందని భావిస్తే.. Erase Device ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు మీ ఫోన్లోని డేటా మొత్తం డిలీట్ ( Erase) అయిపోతుంది. కనుక ఇతరులు మీ డేటాను యాక్సెస్ చేయడానికి వీలుపడదు.
- కానీ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు గనుక Erase Device ఆప్షన్‌ను ఎంచుకుంటే.. ఇక మీ ఫోన్‌ను కనిపెట్టడం టెక్నికల్‌గా సాధ్యం కాదు.
పోలీసులకు రిపోర్ట్ చేయండిలా?
How To Report On CEIR Portal For Lost Phone : ఒకప్పుడు మొబైల్ పోయిందంటే.. ఇక దాని మీద ఆశలు వదిలేయాల్సి వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి.. వాటిని సులువుగా ట్రాక్ చేయగలుగుతున్నారు. అందుకే ఫోన్ పోయిన వెంటనే మీరు ఏమీ కంగారు పడకూడదు. వీలైనంత త్వరగా పోలీసులకు రిపోర్ట్ చేయాలి. ఆ తరువాత ఆన్లైన్లో ఒక కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా మీరు https://www.ceir.gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- అప్లికేషన్ ఫారంలో.. మీ మొబైల్ నంబర్, IMEI 1, IMEI 2, డివైజ్ బ్రాండ్, డివైజ్ మోడల్ వివరాలను నమోదు చేయాలి.
- అలాగే మీ దగ్గర ఉన్న ఫోన్ పర్చేస్ ఇన్వాయిస్ (ఫోన్ కొనుగోలు రసీదు)ను అప్లోడ్ చేయాలి.
- మీ ఫోన్ దొంగతనానికి గురైన/ పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ - సమయం, రాష్ట్రం, జిల్లా, పోలీస్ స్టేషన్, పోలీస్ కంప్లైంట్ నంబర్ వివరాలను నమోదు చేయాలి. అలాగే పోలీస్ కంప్లైంట్ ప్రతిని అప్లోడ్ చేయాలి. తరువాత..
- మీ పేరు, చిరునామా, మీ ఐడెంటిటీ కార్డ్, ఈ-మెయిల్ వివరాలు నమోదు చేయాలి.
- ప్రస్తుతం మీ దగ్గర ఉన్న/ వాడుతున్న ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేయాలి. వెంటనే ఆ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే.. మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది.
- కంప్లైంట్ రిజిస్టర్ అయిన వెంటనే.. పోలీసులు రంగంలోకి దిగి.. మీ ఫోన్‌ను ట్రేస్ చేసి పట్టుకుంటారు.
నోట్ : సాధారణంగా IMEI నంబర్ లేకపోతే.. ఫోన్‌ను కనిపెట్టడం సాధ్యం కాదు. అందువల్ల మీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే, ప్రత్యేకంగా ఒక దగ్గర IMEI నంబర్ రాసిపెట్టుకోండి. అలాగే చాలా మంది ఫోన్ కొన్న తరువాత ఇచ్చే ఇన్వాయిస్ (రసీదు)ను నిర్లక్ష్యంగా పడేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే.. సదరు ఫోన్ మీదేనని రుజువు చేయడానికి ఇన్వాయిస్ తప్పనిసరి అవుతుంది.