స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపివ్వడం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఉల్ఫా)కు అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈశాన్య భారతంలోనే అతిపెద్ద తీవ్రవాద సంస్థగా పేరొందిన ఉల్ఫా ఈ పంద్రాగస్టుకు మాత్రం తన వైఖరిని మార్చుకుంది. వేడుకల బహిష్కరణకు పిలుపివ్వకపోవడంతో ఉల్ఫా శాంతివైపు అడుగులు వేస్తోందా- అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాయుధ పోరాటం ద్వారా అస్సాముకు సార్వభౌమత్వాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో 1979లో పరేశ్ బారువా, అరబింద రాజ్‌ఖొవ ఉల్ఫాను స్థాపించారు. అప్పట్లో బ్రహ్మపుత్ర లోయలోని ప్రజలు ఉల్ఫాకు బ్రహ్మరథం పట్టారు. వారి గొంతుకను దిల్లీలోని నేతలకు వినిపించేందుకు ఉల్ఫావంటి సంస్థల అవసరం ఉందని భావించారు. దాంతో సంస్థ తిరుగుబాటు కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అనతికాలంలోనే తిరుగుబాటు పేరుతో ఉల్ఫా సభ్యులు హింసకు తెగబడ్డారు. 1990 దశాబ్దంలో రాష్ట్రవ్యాప్తంగా ఉల్ఫా పాల్పడిన హింసాత్మక ఘటనల్లో 10వేల మంది యువకులు మరణించినట్లు అంచనా. భద్రతాదళాలతో జరిగిన ఘర్షణల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రజల్లో అసంతృప్తి మొదలయింది. తదనంతర పరిణామాలతో విసిగిపోయిన ప్రజలు, ఉల్ఫాకు మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆ తరవాత అస్సాముపై ఉల్ఫా క్రమంగా పట్టు కోల్పోయింది. చివరికి ఉల్ఫాను తీవ్రవాద సంస్థగా ప్రకటించిన ప్రభుత్వం దాని కార్యకలాపాలను నిషేధించింది. భద్రతాదళాలు రంగంలోకి దిగి తీవ్రవాద సంస్థపై ఉక్కుపాదం మోపాయి. ఈ ఏడాది ఆగస్టు 11న ఉల్ఫా నుంచి ఈమెయిల్ వచ్చినా- అందులో స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరించాలన్న సందేశం లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ నల్ల జెండాలు, బ్యాడ్జీలను ప్రదర్శించవచ్చని అందులో పేర్కొంది.
బలహీనపడింది...
అస్సాముకు సార్వభౌమత్వాన్ని కల్పించేందుకు చర్చలు జరపాలని ఉల్ఫా డిమాండ్ చేస్తోంది. 'రాజ్యాంగానికి ఇప్పటివరకూ ఎన్నో సవరణలు చేశారు. అస్సాముకు సార్వభౌమత్వాన్ని కల్పించే విధంగా ఎందుకు సవరణలు చేయరు' అని ఉల్ఫా తరచూ ప్రశ్నించేది. ఇటీవలి కాలంలో ఈ సంస్థ బలహీనపడింది. సంస్థాగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇంతకాలం వెన్నెముకలా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా వీడుతుండటం ఉల్ఫాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు నెలల వ్యవధిలో అనుభవజ్ఞులైన గెరిల్లా పోరాట యోధులు జిబాన్ మోరన్, మాంటు సైకియా వంటి నేతలు ఉల్ఫా నుంచి బయటకొచ్చారు. వీరందరూ మయన్మార్‌లోని నాగా ప్రాబల్య ప్రాంతమైన సాంగయింగ్ ప్రాంతం నుంచి అస్సాములోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఉల్ఫాను ఆర్థికంగా ముప్పుతిప్పలు పెట్టాలన్న భారత భద్రతాదళాల వ్యూహాలు ఫలించాయి. సంస్థకు నిధులు సమకూరుస్తున్న వ్యవస్థలు, వనరులను భద్రతాదళాలు గుర్తించి వాటిని నామరూపాల్లేకుండా చేశాయి. ఒకప్పడు ఎంతో చురుకైన తీవ్రవాద సంస్థగా ఉన్న ఉల్ఫా ప్రస్తుతం ఆర్థికంగా కొట్టుమిట్టాడుతోంది. తిరుగుబాటు కార్యకలాపాలు కొనసాగించడం, ఆయుధాలను సమకూర్చుకోవడం మొదలుకొని క్యాంపులోని దళాలకు ఆహారాన్ని సేకరించడంవరకూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఆ పరిణామాలతో ఉల్ఫాకు భారీ నష్టం..
2019 జనవరి, మే నెలల్లో మయన్మార్ సైన్యం (టామడొవ్) జరిపిన దాడులు ఉల్ఫా నేతల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆనాడు తాగాలోని నాగా తిరుగుబాటు వర్గం కల్పంగ్, ఉల్ఫా, మణిపుర్ తీవ్రవాద సంస్థ మేతే సంయుక్త కార్యాలయాన్ని మయన్మార్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ అనూహ్య పరిణామాలతో ఉల్ఫాకు భారీ నష్టం వాటిల్లింది. దీని వెనక భారత్ హస్తం ఉంది. మయన్మార్‌తో ఇండియా అటు సైనికపరంగా, ఇటు దౌత్యపరంగా జట్టుకట్టి, తిరుగుబాటుదారులను అన్నివైపుల నుంచి చుట్టుముట్టింది. 2021 ఫిబ్రవరి సైనిక తిరుగుబాటుతో మయన్మార్‌లో పరిస్థితులు మారినప్పటికీ- ఈశాన్య భారతంలోని తీవ్రవాద సంస్థలపై అప్పటికే కోలుకోలేని దెబ్బపడింది. అస్సాముకు స్వాతంత్య్రం కోసం కమాండర్ ఇన్ చీఫ్ పరేశ్ బారువా నేతృత్వంలోని ఉల్ఫా ఇప్పటికీ డిమాండ్ చేస్తోంది. పరేశ్ ప్రస్తుతం చైనా-మయన్మార్ సరిహద్దులో తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉల్ఫాలోని అరబింద రాజ్‌ఖొవ వర్గం- ప్రభుత్వం మధ్య దశాబ్దకాలంగా జరుగుతున్న చర్చల్లో పురోగతి లేకపోవడంతో అందరిలో నైరాశ్యం, చికాకు నెలకొంది. ఈ పరిణామాల కారణంగా ఉల్ఫా ఇప్పుడు శాంతివైపు అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
- సంజీవ్ కె.బారువా
ఇదీ చూడండి: ఉగ్రరూపం దాల్చిన జలపాతం- ప్రజలు బెంబేలు!