ETV Bharat / opinion

పంజాబ్‌లో సిద్ధూ రాజకీయ కేళి- సీఎం పదవి కోసమేనా? - Assembly elections in Punjab

పంజాబ్​ కాంగ్రెస్​లో వివాదాలు సమసిపోయినట్లు అందురూ భావిస్తున్నారు. తనను పీసీసీ అధ్యక్షుడిగా చేయకముందు వరకు ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టిన నవ్​జ్యోత్​సింగ్​ సిద్ధూ.. ఆ తరవాతా అదే తీరు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలంటూ నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే సిద్ధూ మాటల వెనక అసలు ఆంతర్యం వేరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే దిశగా సిద్ధూ పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు.

Punjab politics
పంజాబ్​ రాజకీయాలు
author img

By

Published : Aug 14, 2021, 5:24 AM IST

నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టగానే పంజాబ్‌లో వాతావరణం చల్లబడిందని అంతా అనుకున్నారు. తన ప్రమాణస్వీకారం సభకు వచ్చిన ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పాదాలకు సిద్ధూ నమస్కరించడంతో ఇక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే భావించారు. పంజాబీ సంస్కృతిలో ఝప్పీ (కౌగిలింత) లేదా పాయ్‌లాగూ (పాదాలకు నమస్కరించడం) ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా అక్కడ అన్నీ సర్దుకుపోయాయనే అనుకుంటారు. సరిగ్గా ఇక్కడే అందరూ బోల్తాకొట్టారు. తనను పీసీసీ అధ్యక్షుడిగా చేయకముందు వరకు ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టిన సిద్ధూ- ఆ తరవాతా అదే తీరు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలంటూ నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదవులు తనకు కొత్త కాదని, గతంలో చాలా పదవులను వదిలేశానని అన్నారు. రైతులు నిరసన వ్యక్తంచేస్తూ రోడ్ల మీద కూర్చున్నారని, వాళ్ల బాధలు తీర్చాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి పదవి కోసం..!

సిద్ధూ మాటల వెనక అసలు ఆంతర్యం వేరు. ఆ రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అందులో తన వర్గం ఎమ్మెల్యేలకు మంచి పదవులు ఇప్పించుకోవడం, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుయాయులకు పెద్దయెత్తున టికెట్లు ఇప్పించుకోవడం, తద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం 'పాజీ' ముందున్న లక్ష్యాలు. నిజానికి పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రస్థాయి వ్యతిరేకత ఉంది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం... ఇలా అనేక అంశాల్లో పార్టీ మీద ప్రజలు గుర్రుగా ఉన్నారు. తప్పు మొత్తాన్ని ముఖ్యమంత్రి మీదకు నెట్టేయడం, తాను వస్తే వీటన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని సిద్ధూ భావిస్తున్నారు. ఆయనతోపాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమితులైనవారు సైతం సిద్ధూనే వెనకేసుకొస్తూ, ఆయన్ను ‘బబ్బర్‌షేర్‌’గా అభివర్ణిస్తున్నారు.

అనేక యుద్ధాల్లో పాల్గొని, రాజకీయ రణరంగంలోనూ ఇప్పటివరకు ఎదురీదుతూ వస్తున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌- ఇంకా తనను తాను పాటియాలా మహారాజుగానే భావించడం ఆయనకున్న అతిపెద్ద లోపం. ఇటీవల కాంగ్రెస్‌పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి మంత్రివర్గ కూర్పులో సమతూకం ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. అంటే, సహజంగానే తన వర్గానికి పెద్దపీట వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ముందరికాళ్లకు బందం వేయడం. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ రాజకీయాల్లో తనకున్న పట్టు ఏమిటో సిద్ధూ ఇప్పటికే నిరూపించుకున్నారు. తనకు బహిరంగంగా క్షమాపణలు చెబితే తప్ప, అసలు పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూను అంగీకరించేది లేదని బీరాలు పలికిన కెప్టెన్‌... చివరకు అదేమీ లేకుండానే ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సి వచ్చింది.

మంత్రివర్గ విస్తరణ కత్తి మీద సామే!

ఇప్పుడు మంత్రివర్గ కూర్పు సైతం ఆయనకు కత్తిమీద సాములాంటిదే. కొత్త మంత్రివర్గంలో సిద్ధూ ముద్ర ఏమాత్రం కనిపించినా- ఒకరకంగా పార్టీ మీద, ప్రభుత్వంలోనూ తన పట్టును కెప్టెన్‌ కోల్పోయినట్లే అవుతుంది. పార్టీ పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీష్‌ రావత్‌ త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటించి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వల్ల జరిగే నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తారని దిల్లీ వర్గాలు అంటున్నాయి. అసలు ఎన్నికలు వచ్చేవరకైనా సిద్ధూ వర్గం ఆగుతుందా, లేకపోతే ఈలోపే అమరీందర్‌ సింగ్‌ను తప్పించాలని తీర్మానం చేస్తుందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే పంజాబ్‌ కాంగ్రెస్‌లో పెనుసంక్షోభం తప్పదు. ఇప్పటికిప్పుడు సిద్ధూను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినంత మాత్రాన వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే నమ్మకం లేదు.

ఇప్పటికే ఆ రాష్ట్రాన్ని మళ్ళీ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని భాజపా విశ్వప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు అక్కడి వ్యాపార, పారిశ్రామిక వర్గాలన్నీ భారతీయ ఆర్థిక పార్టీ(బాప్‌)ని స్థాపించాయి. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (చాదునీ వర్గం) అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్‌ చాదునీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించేశాయి. ఈ పార్టీ స్థాపన వెనక ఉన్న కీలకవ్యక్తి తరుణ్‌ బావా జైన్‌కు గతంలో భాజపాతో సంబంధాలున్నాయి. ఆయన భార్య 2007 నుంచి 2012 వరకు భాజపా టికెట్‌పై లూథియానాలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఇప్పుడు జైన్‌ను బాప్‌ జాతీయాధ్యక్షుడిగా ప్రకటించారు. ఇప్పటికీ అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్న పంజాబ్‌వాసులు ఈసారి ఎవరికి పట్టం కడతారో, ఎవరి ఓట్లను ఎవరు చీలుస్తారో తేలాలంటే మాత్రం వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల వరకూ ఆగాల్సిందే!

రచయిత- అరవపల్లి ఉషారాణి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.