ప్రపంచంలో ఏ ప్రాంతమైనా అభివృద్ధి సాధించాలంటే నీరు అత్యావశ్యకం. మానవ జీవనానికి, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలకు ముఖ్యమైన సహజవనరు నీరు. ఇండియాలో చాలా భూభాగానికి నదుల నీటి వసతి లేదు. దేశంలోని 138 కోట్ల జనాభాలో దాదాపు 80శాతం తాగు, సాగు నీటి అవసరాలకు వర్షపు నీరు, భూగర్భ జలాలే ఆధారం. వాన నీటిని సమర్థంగా నిల్వచేసి, సక్రమంగా వినియోగించుకునేందుకు గతంలో మన పెద్దలు ఎన్నో విధానాలను అవలంబించారు. ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వాటి వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేవి. పోనుపోను ప్రభుత్వాలు, ప్రజల నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో అవి నిరుపయోగంగా మారాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో వ్యత్యాసాలు, జనాభా పెరుగుదల కారణంగా భూగర్భజలాలు నానాటికీ అడుగంటుతున్నాయి (India's Water Crisis). ఫలితంగా రాబోయే రెండేళ్లలో దిల్లీ సహా కనీసం 21 నగరాలు తీవ్ర నీటి ఇక్కట్లను ఎదుర్కోబోతున్నాయని అధ్యయనాలు చాటుతున్నాయి. నీటి సంక్షోభం కారణంగా భారత్ 2050 నాటికి ఆరు శాతం స్థూల దేశీయోత్పత్తిని కోల్పోతుందని అంచనా. నీటి కొరత వలసలకు, ప్రాంతీయ వివాదాలకు సైతం దారితీస్తుంది.
తీవ్ర ఎద్దడి
భారతీయులకు నీటి వనరుల నిర్వహణలో (Water Management in India) గొప్ప చరిత్ర ఉంది. అందరి శ్రేయస్సు కోసం ఏర్పాటైన సామూహిక వనరులుగా వాటిని మన పూర్వీకులు భావించేవారు. వాటి నిర్వహణలో చాలా వరకు మహిళలే కీలక పాత్ర పోషించేవారు. వాటి ద్వారా భూగర్భజలాల పెంపుపై సైతం దృష్టి సారించేవారు. అలా వారు తీవ్ర కరవులను సైతం తట్టుకొని మనుగడ సాగించారు. దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వాన నీటి సేకరణ వ్యవస్థలు ఉండేవి. తూర్పు హిమాలయాల్లో వెదురు గొట్టాలతో నీటి సేకరణ, పశ్చిమ హిమాలయాల్లో చిన్న నీటి కాలువలు, వృత్తాకార బావులు (కుండ్‌లు), వ్యవసాయం కోసం కుంటలు, చెరువుల్లో నీటిని నిల్వచేసే ఖాదిన్, జోహడ్ వ్యవస్థలు, థార్ ఎడారి, గుజరాత్‌లో మానవ నిర్మిత మెట్ల బావులు, బిహార్‌లో వరద నీటి సేకరణ వ్యవస్థ వంటి సంప్రదాయ పద్ధతులు గతంలో సమర్థంగా పనిచేసేవి. తెలంగాణలో కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొన్ని చెరువులు నిర్మితమయ్యాయి. ఇలాంటివన్నీ వర్షపు నీటిని సేకరించడానికి, నిల్వ చేయడానికి, అడవుల పెరుగుదలకు, నేల కోతను నివారించడానికి తోడ్పడేవి. భూగర్భ జలాలను గణనీయంగా పెంచేవి. ఫలితంగా ప్రజలకు నీటి వసతులు సులభంగా అందుబాటులో ఉండేవి. పాడిపంటలతో వారు ఆనందంగా జీవించేవారు. కాలక్రమంలో మన పూర్వీకులు ఏర్పరచిన విలువైన నీటి సేకరణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వర్షపు నీటిలో కొట్టుకొచ్చిన మట్టి వాటిలో పేరుకుపోయి, నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. వాటి మరమ్మతులు, నిర్వహణ గురించి స్థానిక ప్రజలు, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఫలితంగా నీటి సమస్యలు ముమ్మరిస్తున్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో 44 చెక్ డ్యామ్‌లు ఉన్నాయి. వాటిలో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గింది. పూడిక వల్ల ఎనిమిది నుంచి పదేళ్ల వ్యవధిలో నీటి నిల్వ వ్యవస్థలు నిరుపయోగంగా మారతాయి. అందువల్ల కనీసం మూడేళ్లకోసారి వాటిలో పూడిక తొలగించాలి. ఆయా వ్యవస్థల్లోకి చేరే నీరు కలుషితం కాకుండా ఏటా సమీప ప్రాంతాల్లో చెత్తాచెదారాలను తొలగించాలి. ప్రస్తుతం భారత్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని నీతి ఆయోగ్ పేర్కొంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం విశ్వవ్యాప్తంగా భూగర్భజలాల డిమాండులో 25శాతం భారత్‌లోనే ఉంది. సంప్రదాయ పద్ధతుల ద్వారా వాటిని పెంచుకోవచ్చు.
అవగాహన కల్పించాలి
దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, ఇతర ఏజెన్సీలు, ప్రభుత్వాలు కొత్తగా నీటి నిల్వ కోసం పలు నిర్మాణాలు చేపడుతున్నాయి. వాటితోపాటు మన పూర్వీకులు ఏర్పరచిన నీటి నిల్వ వ్యవస్థలను వెంటనే పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి గ్రామానికీ సమీపంలో నాలుగు నుంచి అయిదు చెరువులుంటాయి. వాటిలోని నీరు ఒక ఏడాదిపాటు పరిసర గ్రామాల అవసరాలను తీరుస్తుంది. గతంలో రాజస్థాన్‌లోని రబ్రియావాస్ ప్రాంతం తీవ్ర నీటి కొరతవల్ల నివాసయోగ్యంగా ఉండేది కాదు. ఎడారి ప్రాంతంలో సహస్రాబ్దాలుగా జీవనం కొనసాగించడంలో తోడ్పడిన పురాతన నాడీల (గ్రామ ప్రవాహాల) పునరుద్ధరణతో ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ కేంద్రంగా మారింది. తెలంగాణలో 'మిషన్ కాకతీయ' పథకం కింద చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ జరుగుతోంది. సంప్రదాయ వర్ష జలాల సేకరణ వ్యవస్థలపై పెద్దయెత్తున అవగాహన కల్పించాలి. వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తే- వారు స్వచ్ఛందంగా నీటి వనరుల నిర్వహణకు ముందుకొస్తారు. ప్రతి వాననీటి బొట్టును ఒడిసిపట్టడం సహా నీటి వనరులను సమర్థంగా నిర్వహించుకుంటే భవిష్యత్తులో కరవు పరిస్థితులను నివారించగలం.
- ఆచార్య నందిపాటి సుబ్బారావు
(భూగర్భ రంగ నిపుణులు)
ఇదీ చూడండి: జల సంక్షోభం.. నగర జీవికి నీటి వెతలు