భూతాపం హెచ్చి వాటిల్లే అనర్థాల తీవ్రత తరచూ మానవాళిని కుంగదీస్తూనే ఉంది. రుతువులు గతి తప్పుతున్నాయి. పోనుపోను అతివృష్టి, అనావృష్టి పెచ్చరిల్లుతున్నాయి. ప్రకృతి విలాపమే పెను విపత్తులుగా దాపురించి దేశదేశాలు తరతమ భేదాలతో ఎన్నో కడగండ్ల పాలబడుతున్నాయి. భారత్‌కు సంబంధించినంతవరకు పర్యావరణ మార్పులపై రూపొందిన ‘మొట్టమొదటి సమగ్ర నివేదిక’ వచ్చే 80ఏళ్లలో విపత్కర పరిస్థితుల్ని కళ్లకు కడుతోంది.
వాస్తవానికి, ఏడాదిన్నరక్రితం దేశంలోని 20శాతం జిల్లాల్లో సాగుపై వాతావరణ మార్పులు ఎంతటి ప్రభావం చూపనున్నాయో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అధ్యయనం మదింపు వేసింది. 150దాకా జిల్లాల్లో పంటలు, తోటలు, పశుసంపదపై వాతావరణ వైపరీత్యాలకు అది అద్దంపట్టింది. గత పదేళ్లలో వెలుగుచూసిన పలు అంతర్జాతీయ నివేదికలూ ఇతర దేశాలతోపాటు ఇండియా ఏమేర నష్టపోనున్నదీ అంచనాలు పొందుపరచాయి. వాటితో పోలిస్తే దేశీయ భౌగోళిక స్థితిగతుల్ని లోతుగా పరిశీలించిన తాజా కసరత్తు- 2100 సంవత్సరంనాటికి సగటు ఉష్ణోగ్రతలో 4.4 డిగ్రీల సెల్షియస్ వరకు పెంపుదల తథ్యమంటోంది.
అడ్డుకట్ట వేయాల్సిందే..
అప్పటికి ఉష్ణపవనాల సంఖ్య మూడు నాలుగు రెట్లు అధికమవుతుందని, తుపానుల తాకిడి జోరెత్తుతుందని, సముద్రమట్టం ముప్ఫై సెంటీమీటర్ల మేర పెరగనుందన్న అంచనాలు భీతి పుట్టిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల వ్యవధిలో హిమాలయాలు 13 శాతం హిమానీ నదాలను కోల్పోయాయన్న సమాచారం ఆరేళ్లక్రితం కలకలం రేకెత్తించింది. పర్యావరణ విధ్వంసానికి సత్వరం అడ్డుకట్ట వేయకపోతే, అంతకుమించిన మహావినాశం దేశానికి తప్పదన్న హెచ్చరిక- తక్షణ ఉమ్మడి కార్యాచరణవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఉరకలెత్తించాలి!
కర్బన ఉద్గారాల విడుదల ఇంతలంతలై భూ ఉష్ణోగ్రతలు అధికమై మంచుకొండలు కరిగి సముద్రమట్టాలు పెరిగితే నష్టమేమిటి? అసంఖ్యాక జనావాసాలకు ముంపు సమస్య ఉత్పన్నమై- ప్రకృతి ఉత్పాతాలు విజృంభించి పంట దిగుబడులూ కొల్లబోతాయి. హిమపాతాలు, భీకర మంచుదాడులు ముమ్మరిస్తాయి. స్వభావసిద్ధంగానే ఇండియాలో నాలుగుకోట్ల హెక్టార్ల భూభాగానికి వరద ముప్పు, 68శాతం ప్రాంతానికి కరవు కాటకాల ప్రమాదం పొంచి ఉన్నట్లు సర్కారీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆహార కొరత తప్పదు..
దశాబ్దాల తరబడి ప్రకృతి సమతూకాన్ని దెబ్బతీసిన చర్యల పర్యవసానంగా వచ్చే నలభై ఏళ్లలో వరిసాగు భూముల్లో 100శాతం, మొక్కజొన్న పండించే నేలల్లో సుమారు 90శాతం, సోయాచిక్కుడు విత్తే క్షేత్రాల్లో 80శాతం దాకా దిగుబడులపై ప్రభావం ప్రసరిస్తుందని ఐరాస నివేదిక మూడు నెలల క్రితమే స్పష్టీకరించింది. వాతావరణ మార్పుల కారణంగా ఇండియాలో అరటి ఉత్పత్తి క్షీణించనుందని నిపుణులు హెచ్చరిస్తుండటం తెలిసిందే. దేశంలో అడ్డూఆపూ లేని వనవిధ్వంసం హిమాలయ, ఈశాన్య, కోస్తా ప్రాంతాలతోపాటు పశ్చిమ కనుమల్లో ఎంతటి దుష్పరిణామాలకు మూలం కానుందో చాటే విశ్లేషణలెన్నో పోగుపడి ఉన్నాయి.
భారత్ చురుగ్గా దిద్దుబాట పట్టకపోతే 2050నాటికి విదేశాలనుంచి భారీయెత్తున ఆహార ధాన్యాల దిగుమతులకు వెంపర్లాడక తప్పదని ప్రపంచబ్యాంకు నిరుడే ఉద్బోధించింది. వాతావరణ మార్పులతో మిడతల దండూ ప్రభుత్వాలకు గడ్డుసవాలు విసరగలదని రుజువవుతున్న తరుణంలో, పాలకశ్రేణులు ఉపేక్షించేకొద్దీ కష్టనష్టాలు తీవ్రతరమవుతాయి. భూ ఉష్ణోగ్రతల కట్టడికోసం అటవీ విస్తీర్ణం పెంపుదల; ఇంధన, భూవినియోగం, రవాణా, నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో సర్దుబాట్లు; పంటల సరళిలో పరిస్థితులకు అనుగుణంగా తగిన మార్పులు చేర్పులు- ప్రభుత్వాల అజెండాలో అంతర్భాగం కావాలి. పాలకశ్రేణులు సకాలంలో మేలుకొనకపోతే ప్రకృతి ఉత్పాతాలు నిలువునా ముంచేస్తాయి!