ETV Bharat / opinion

మెరుగైన వసతులతో 'హాకీ' పునరుజ్జీవం.. ఫ్యాన్స్​లో మళ్లీ కొత్త ఆశలు!

భారత్‌లో క్రీడ అనగానే సాధారణంగా ఎవరికైనా క్రికెట్‌ పేరే ఠక్కున గుర్తొస్తుంది. నిజానికి క్రికెట్‌ ప్రబల శక్తిగా ఎదగకముందే ప్రపంచాన్ని భారత హాకీ స్టిక్‌ ఏలింది. క్రమంగా దేశీయంగా ప్రభ కోల్పోయిన హాకీ- చాలా రోజుల తరవాత మళ్లీ కళకళలాడుతోంది. ఈ ఏడాది హాకీ ప్రపంచకప్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది.

2023 Mens FIH Hockey World Cup Tournament

author img

By

Published : Jan 13, 2023, 6:48 AM IST

ఒలింపిక్స్‌లో సుదీర్ఘ విరామం తరవాత పోడియం ఎక్కడం.. ప్రపంచ అగ్రశ్రేణి జట్లపై విజయాలు.. ర్యాంకింగ్‌లో ముందంజ లాంటివి దేశీయంగా హాకీ అభిమానుల్లో మళ్ళీ కొత్త ఆశలు రేపుతున్నాయి. ఈ క్రమంలో హాకీ ప్రపంచ కప్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. నేడు ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో మన జట్టు పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. చాలా ఏళ్ల క్రితమే దేశీయంగా వెలుగులు కోల్పోయిన హాకీ- మళ్ళీ గాడిలో పడటానికి ఒడిశా ప్రభుత్వం అందించిన అండదండలు కీలకంగా నిలిచాయి. సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు చేయవచ్చు అనే మాటకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ ఫీనిక్స్‌ పక్షిలా మళ్ళీ మన హాకీ ఎగసింది.

ఒడిశా దన్ను
ధ్యాన్‌చంద్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో ప్రపంచాన్ని ఏలి..ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు సాధించిన ఘన చరిత్ర భారత హాకీ సొంతం. పోనుపోను ఆ ప్రభ మసకబారింది. పతకం మాట అలా ఉంచితే, ఘోర పరాజయాలు హాకీ అభిమానుల్లో తీవ్ర నిరాశ నింపాయి. రాజకీయ జోక్యం పెరిగిపోయి క్రీడాకారులను పట్టించుకోని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ప్రతి టోర్నీలో ఇండియాది వెనకడుగే అయ్యింది.

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌కు కనీసం అర్హత సాధించలేకపోవడంతో భారత హాకీ పరువు పాతాళానికి దిగజారిపోయింది. ఆటగాళ్లు, కోచ్‌లు మారినా మన హాకీ తలరాత మారలేదు. ఇక ఈ దుస్థితి ఇంతే అనుకుంటున్న దశలో అద్భుతమే జరిగింది. గత అయిదారేళ్లలో భారత హాకీలో పెను మార్పులువచ్చాయి. విదేశీ కోచ్‌లు, ఫిట్‌నెస్‌ నిపుణులు, భారీగా నిధులు సాకారమై- క్రికెటర్లకు తీసిపోని విధంగా హాకీ క్రీడాకారులకు వసతులు దక్కాయి. గడ్డి మైదానంలో మాదిరిగా ఆస్ట్రోటర్ఫ్‌పై ఆడటానికి తడబడిన మనవాళ్లు ఇప్పుడు అదే టర్ఫ్‌ మైదానాల్లో పాదరసంలా కదులుతున్నారు.

దేశీయంగా హాకీ రూపురేఖలు మారడం వెనక కార్పొరేట్‌ సంస్థలు కాదు- ఒడిశా ప్రభుత్వ చొరవ ప్రధానమైనది.భారత పురుషులు, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్‌గా ఉండాలని 2018లో ఒడిశా ప్రభుత్వం నిర్ణయించడం ఆ క్రీడకు వరమే అయ్యింది. రూ.100 కోట్ల ఆ భారీ స్పాన్సర్‌షిప్‌ దేశీయంగా హాకీ రూపురేఖల్ని మార్చింది. భువనేశ్వర్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన స్టేడియంలో క్రీడాకారులకు సాధన చేసుకునే అవకాశం దక్కింది.

లక్షల రూపాయలు వెచ్చించి విదేశీ కోచ్‌లను నియమించడం, క్రికెట్‌ తరహాలో మానసిక నిపుణులు, శరీర సామర్థ్య పెంపుదలపై దిశానిర్దేశం చేసే కోచ్‌ల ఏర్పాటుతో హాకీ తీరే మారిపోయింది. తద్వారా పురుషులు, మహిళల జట్లు మళ్ళీ గాడిలో పడి టాప్‌-10లోకి దూసుకొచ్చాయి. ఒకప్పుడు ఒలింపిక్స్‌ బెర్తే గగనంగా ఉండే మహిళల జట్టుకు గత ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం దక్కింది. ఇక పురుషుల జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తరవాత కొత్త చరిత్ర లిఖిస్తూ కాంస్య పతకం సొంతం చేసుకుంది. 2018 ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా క్రీడలు, 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతాలు గెలవడం హాకీలో భారత్‌ సాధించిన ప్రగతికి నిదర్శనాలు.

అమెరికా మెరుగైన మౌలిక వసతులతో మేటి క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. చిన్నతనం నుంచే క్రీడాకారులకు సానపట్టి చైనా, జపాన్‌లు విశ్వ క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నాయి. భారత్‌లో దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. అమెరికా, చైనా లాంటి దేశాలతో పోలిస్తే క్రీడలకు బడ్జెట్‌లో భారత్‌ చాలా తక్కువ నిధులు కేటాయిస్తోంది. ఖేలో ఇండియా లాంటి కార్యక్రమాల ద్వారా ఆటలకు కొంతమేర ఊపిరి అందుతున్నా.. సమధిక నిధులు, ప్రత్యేకమైన ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో క్రీడలకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. అందుకోసం అవసరమైన చోట స్టేడియాలు నిర్మించి, కోచ్‌ల సంఖ్యను పెంచాలి. విదేశీ కోచ్‌లు, అధునాతన శిక్షణ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తే హాకీ మాదిరిగా ఇతర క్రీడలకూ ప్రోత్సాహం లభిస్తుంది.

ఆహ్వానించదగిన పరిణామం
హాకీ ప్రపంచకప్‌ కోసం రావుర్కెలాలో ఒడిశా ప్రభుత్వం రూ.120 కోట్లతో ప్రపంచస్థాయి స్టేడియం నిర్మించింది. ఇరవై వేలకు మించిన సీటింగ్‌ సామర్థ్యం కలిగిన ఆ మైదానంలో రెండు వందలకు పైగా గదులతో క్రీడాకారులకు సకల సౌకర్యాలు కల్పించారు. క్రికెటేతర ఆటల్లో ఇంతటి ప్రోత్సాహం ఆశ్చర్యకరమే. భారత్‌లో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రస్తుత హాకీ ప్రపంచకప్‌ గెలిస్తే భారత జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నజరానా అందిస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌ చివరిసారిగా 1975లో హాకీ ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది. మరోసారి విజయం అందివస్తే ఇండియాలో అది మరో హాకీ విప్లవానికి నాంది పలుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

మేటి ప్రోత్సాహం
అయిదుగురు భారత హాకీ కెప్టెన్లు, 60 మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఒడిశాలోని సుందర్‌గఢ్‌ నుంచే వచ్చారు. సుందర్‌గఢ్‌ నేలలో ఉండే సహజసిద్ధమైన కాల్షియం వల్ల అక్కడ నివసించే వారి ఎముకలు బలంగా ఉండటంతోపాటు, హాకీ మైదానంలో వాళ్లు అలసిపోకుండా పాదరసంలా కదులుతారన్నది నిపుణుల మాట. హాకీకి తమ రాష్ట్రంతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ఆ క్రీడకు అండగా నిలవడానికి ముందుకొచ్చింది. హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌లు సైతం ఒడిశా బాటలోనే సాగుతున్నాయి. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి బాక్సింగ్‌, రెజ్లింగ్‌లలో సదుపాయాలు కల్పిస్తున్నాయి.

దూర ప్రాంతాల నుంచి కోచ్‌లను రప్పించి ఛాంపియన్లను తయారు చేస్తున్నాయి. గెలిచి వచ్చాక బహుమతులు ఇవ్వడం కాకుండా పతకాలు తేకముందే స్పాన్సర్‌షిప్‌ ఇచ్చి ఆటలో పదును తేల్చి అంతర్జాతీయ వేదికలకు పంపుతున్నాయి. ఫలితంగా సుశీల్‌ కుమార్‌, సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా లాంటి వారు రెజ్లింగ్‌లో ఒలింపిక్స్‌ పతకాలతో మెరిశారు. వారికన్నా ముందు బాక్సింగ్‌లో విజేందర్‌సింగ్‌ సైతం ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.170 కోట్లు వెచ్చించి 2032 ఒలింపిక్స్‌ వరకు రెజ్లింగ్‌కు స్పాన్సర్‌గా ఉండాలని నిర్ణయించింది. మిగిలిన రాష్ట్రాలూ తమ ప్రాంత ప్రాధాన్యాన్ని బట్టి ఆయా క్రీడలకు మద్దతుగా నిలిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. -దాస్యం వెంకట వంశీకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.