ఇలా చేస్తే క్లీనింగ్ పని తప్పినట్లే!
వంట చేయడమే పెద్ద పని అనుకుంటే.. ఇక వంటంతా పూర్తైన తర్వాత కిచెన్ శుభ్రం చేయాలంటే చుక్కలు కనిపించక మానవు. మరి ఈ బాధ తప్పాలంటే ఈ సింపుల్ చిట్కాను పాటించి చూడండి. అందుకోసం.. కిచెన్‌లో పని మొదలుపెట్టేముందే కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ లాంటివి పరచండి.. మీ కటింగ్ లేదా పిండి కలపడం లాంటివి చేస్తున్నప్పుడు చెత్తంతా పేపర్‌పై పడుతుంది. మీ పని పూర్తైన వెంటనే పేపర్ లేదా ప్లాసిక్ కవర్‌ని చుట్టి చెత్తడబ్బాలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చాలా వరకు క్లీనింగ్ పని తప్పించుకున్నట్లే!
సింగిల్ పాట్ వంటకాలు!
అందరూ ఇంట్లో ఉండడం వల్ల రుచికరమైన వంటకాలు కావాలని కోరుకుంటారు. అలాగని మనం వంట చేస్తూ కూర్చుంటే మన ఆఫీస్ పని కోసం గడిచే సమయం ఆగదు. కాబట్టి ఇలాంటి సమయంలో అటు రుచితో పాటు.. ఇటు మీ సమయాన్ని ఆదా చేసే సింగిల్ పాట్ వంటకాల్ని ఎంచుకోండి.. అంటే క్యారట్ రైస్, పుదీనా రైస్, పులిహోర, వెజిటబుల్ రైస్.. ఇలాంటివి చేయండి. వీటి వల్ల ప్రత్యేకంగా కూర వండాల్సిన పని ఉండదు. విభిన్న రుచిని మీ కుటుంబ సభ్యులకు అందించిన వారవుతారు. అలాగే పాత్రల వాడకం కూడా తగ్గి గిన్నెలు తోమడం కూడా సులువవుతుంది. మరి, మీకు ఉదయాన్నే సమయం సరిపోనప్పుడు ఇలాంటి తరహా వంటకాల్ని ట్రై చేసి చూడండి.. కచ్చితంగా అందరూ మారు మాట్లాడకుండా తినడం ఖాయం.
కటింగ్ అంతా ముందు రోజే..
కూరగాయల్ని ముందురోజే కట్ చేసి పెట్టుకోండి.. ఇది అందరూ కామన్‌గా చేసేదే అనుకోండి.. కానీ కొందరు బద్ధకం కొద్దీ రేపు ఉదయమే కట్ చేసుకోవచ్చులే అనుకుంటారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడంతో ఇక పని అయినట్లే! కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని రాత్రే కూరగాయలు కోసి పెట్టుకోండి. అయితే క్యారట్స్, బీన్స్, చిక్కుడు, బీట్‌రూట్, బెండకాయ.. వంటివి కట్ చేసి పెట్టుకుంటే పర్లేదు. కానీ వంకాయ, బంగాళాదుంప.. వంటివి రాత్రి కట్ చేసుకుంటే మరుసటి రోజుకి పాడైపోతాయి.. అలాగే కట్ చేసుకున్న కాయగూరల్ని ఫ్రీజర్ బాక్స్‌లు లేదా జిప్పర్ బ్యాగ్స్‌లో పెడితే రెండు మూడు రోజులైనా తాజాగా ఉంటాయి. ఈ లెక్కన వారానికి సరిపడా కాయగూరల్ని రెండుసార్లు కట్ చేస్తే సరిపోతుంది.
జిడ్డు వదిలించండిలా!
వంటింట్లో వంట చేయడంతో పని పూర్తవదు. వండిన పాత్రల్ని శుభ్రం చేయడం అంటేనే అబ్బా అని విసుక్కుంటుంటారు చాలామంది. కానీ చిన్న చిట్కా పాటిస్తే చకచకా గిన్నెలు తోమేయచ్చు. ఇందుకోసం బాగా జిడ్డుగా, మురికిగా ఉండే పాత్రల్ని ముందుగానే కాస్త సోప్ నీటిలో వేసి నానబెట్టండి. అలా ఓ గంటపాటు ఉండనిచ్చి.. మీరు మిగతా గిన్నెలు తోమే లోపు అవి నానిపోతాయి. తద్వారా వాటి జిడ్డు, మురికి త్వరగా వదిలిపోయి గంటల తరబడి అంట్లు తోమడానికి సమయం వృథా కాదు.
ఇవి కూడా!
- ఒక్కసారి కూర వండడానికే చిరాకొస్తుంది.. ఇక సాయంత్రం కూడా కూరంటే మా వల్ల కాదు బాబోయ్ అంటుంటాం.. కాబట్టి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు పులుసు కూరలు లేదంటే వీలైతే ఉదయాన్నే మరో కూర చేసి పెట్టుకుంటే ఇక రాత్రికి దిగులుండదు. దాంతో ఆఫీస్ పని పూర్తి కాగానే కాస్త విశ్రాంతి దొరుకుతుంది కూడా!
- ప్రస్తుతం ఒవెన్‌లో ఈజీగా చేసుకునే వంటలకు ఆదరణ పెరిగింది. కాబట్టి ఇంట్లో ఒవెన్ ఉన్న వాళ్లు ఇలాంటి వంటల్ని ట్రై చేయండి. పైగా ఒవెన్‌లో వంటలు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అంతేకాదు.. ఇందుకోసం ఎక్కువ పాత్రలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.. కాబట్టి గిన్నెలు కడిగే శ్రమ కూడా తగ్గుతుంది.
చూశారుగా.. ఇంటి నుంచే పని చేయాల్సిన మహిళలు వంటింట్లో సులభంగా పని ముగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..! అటు త్వరగా పని ముగించుకోవచ్చు.. ఇటు సాయంత్రం పని పూర్తయ్యాక కాస్త విశ్రాంతి కూడా దొరుకుతుంది.. ఏమంటారు?
-
ఇదీ చదవండి: