సన్నబడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మంది శారీరక శ్రమ లేక, జంక్ ఫుడ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా లావు అవుతున్నారు. చక్కగా వ్యాయామం చేసేవారు త్వరగానే సన్నబడతారు. కానీ వ్యాయామం చేసే అంత సమయం గానీ.. ఆసక్తి గానీ లేని వారి సంగతి? పోనీ.. డైటింగ్ చేయాలనుకున్నా అన్ని వేళలా దాన్ని పాటించలేని వారి సంగతి? ఇలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. వ్యాయామం.. డైట్ చేయకపోయినా.. రోజువారి ఆహారపు అలవాట్లలోనే కొద్ది మార్పులతో ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. అవేంటంటే...
వంటలో ఘాటు ఉండేలా చూడండి
రుచికరమైన భోజనం ఉంటే.. కడుపు నిండా లాగించేస్తాం. ఆహారప్రియులు ఒక ముద్ద ఎక్కువే తింటారు. దీంతో ఒంట్లో కొలస్ట్రాల్ పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. అలా అని నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు తినే ఆహారంలో కారం కాస్త ఎక్కవ వేయండి లేదా మిరియాలు వేయండి. మిరియాలు ఆహారాన్ని మరింత రుచికరంగా చేయడంతోపాటు.. ఆకలిని, ఒంట్లో కెలరీలను తగ్గిస్తుంది.
పొడవాటి గ్లాసుల్లో తాగండి
కూల్‌డ్రింగ్, ఇతర పానీయాలను వెడల్పాటి గ్లాసుల్లో కాకుండా పొడవాటి గ్లాసుల్లో తాగండి. దీంతో తక్కువ పరిమాణంలో పానీయం తీసుకున్నా ఎక్కువగా తాగిన ఫీలింగ్ కలుగుతుంది. వీలైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. దీని వల్ల పానీయం తగ్గి నీటి పరిమాణం పెరుగుతుంది. ఆరోగ్యానికి మంచింది.
పూదీన పానీయం తీసుకోండి
పూదీన వాసన, రుచి మనిషి బరువు తగ్గించడంలో దోహదపడతాయి. ఖాళీ సమయాల్లో జంక్ ఫుడ్, స్నాక్స్ తినకుండా పూదీన టీ, పూదీన రసం తాగడం అలవాటు చేసుకోండి. కుదరకపోతే.. పూదీన రుచి ఉంటే క్యాండీస్ తినండి.
చేతిని మార్చి తినండి
చాలామంది కుడి చేతితోనే తింటుంటారు. ఎడమచేతి వాటం ఉన్నవాళ్లు ఎడమ చేతితో తింటారు. తినే ఆహారంపై నియంత్రణ తెచ్చుకోవాలంటే చేతిని మార్చి తినండి. అంటే కుడి చేతితో తినేవాళ్లు ఎడమచేతితో స్పూన్ సహాయంతో తినండి. ఎడమచేతి వాటం వాళ్లు కూడా అలాగే చేయండి. దీని వల్ల ఆహారం తక్కువ తినడంతోపాటు.. ఏం తింటున్నామనే దానిపై స్పృహ ఉంటుంది.
చిన్న ప్లేట్లలో..
పెద్ద ప్లేట్లలో ఎక్కువ ఆహారం కూడా తక్కువగా కనిపిస్తుంది. వదిలేయకూడదని మొత్తం తినేస్తాం. అందుకని చిన్న ప్లేట్లలో ఆహారం పెట్టుకోండి. పౌష్టికాహార నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఓ సర్వేలో 31శాతం మంది పెద్ద ప్లేట్లలో ఎంత పెట్టినా తినేశారట. అలాగే ప్లేట్లు రంగుల్లో ఉండేలా చూసుకుంటే ఆ రంగులు ఆహారంలో కలిసిపోయి ఎక్కువగా కనిపిస్తుందట. దీంతో ఎక్కువ తింటున్నామనుకొని తక్కువే తింటారట.
తినే ముందు మంచినీరు తాగండి
భోజనం చేసే ముందు వీలైనంత మంచినీరు తాగండి. దీనివల్ల ఆకలి కాస్త మందగిస్తుంది. నీటిలో కెలరీలు ఉండవు కనుక.. ఎంత తాగినా ఇబ్బంది ఉండదు.
మాంసం తగ్గించి.. కూరగాయలు తినండి
శరీరంలో కెలరీలు తగ్గించుకోవాలంటే భోజనంలో మాంసం బదులు.. ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకోండి. మాంసం బదులు పుట్టగొడుగులు తినండి.
పప్పుధాన్యాలకు ముందు పెరుగు
పప్పుధాన్యాలతో భోజనం చేస్తే రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతోంది. అది బరువు పెరుగుదలకు దారి తీస్తుంది. అలా అని వాటిని తినకుండా ఉండలేం. కాబట్టి వాటిని తినే పద్ధతి మార్చండి. పప్పుధాన్యాలు తినే ముందు పెరుగు తినండి. ఆ తర్వాత పప్పుధాన్యాలు తినండి.
ఇదీ చదవండి రాష్ట్రంపై కరోనా పడగ... మళ్లీ పది వేలకు పైగా కేసులు