కొవిడ్ రెండోసారి రావడంపై పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి వైరస్ జన్యుపరమైన పరిశోధనల అవసరం మరింతగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండోసారి కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కేసులు వచ్చాయి. వీటిని పరిశీలించినప్పుడు మొదటిసారి సోకిన వైరస్ శరీరంలో తటస్థం కాకుండా ఉండిపోవడంతో కొందరిలో తిరగబెట్టింది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండి పాత వైరస్‌ను గుర్తించక కూడా తిరగబెట్టిన కేసులు ఉన్నాయి. వీటిని రీఇన్‌ఫెక్షన్‌గా పరిగణించడం లేదు. వైరస్ జన్యుక్రమంలో మార్పులతో కొత్త రకం కరోనా వైరస్ సోకినప్పుడు మాత్రమే రీఇన్‌ఫెక్షన్ అంటున్నారు. ప్రత్యేకంగా స్పైక్ ప్రొటీన్‌లో మార్పులతో రెండోసారి కొవిడ్‌కు అవకాశం ఉందని ఇదివరకే వెల్లడైంది. వీటిలో మార్పులు లేకపోయినా.. వైరస్‌కు సంబంధించిన ఇతర జన్యువుల్లో వేటిలో మార్పులున్నా రీఇన్‌ఫెక్షన్‌కు అవకాశం ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. అపోలో ఆసుపత్రితో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. రెండోసారి వైరస్ సోకిన ఇద్దరు రోగుల నమూనాలపై పరిశోధన చేశారు.
- మొదటి కేసులో 61 ఏళ్ల వ్యక్తికి ఆగస్టు 31న కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నారు. నవంబరు రెండోవారంలో దగ్గు రావడం, బలహీనంగా ఉండటంతో పరీక్ష చేయిస్తే రెండోసారి పాజిటివ్ వచ్చింది. తేలికపాటి వ్యాధి లక్షణాలే ఉన్నాయి. జన్యుక్రమాలను విశ్లేషించగా.. మొదటిసారి, రెండోసారి వైరల్ జన్యువుల మధ్య 10 ప్రత్యేక వైవిధ్యాలను పరిశోధకులు గుర్తించారు. స్పైక్ ప్రొటీన్‌లో మాత్రం ఎలాంటి తేడా లేకపోవడం గుర్తించారు.
- రెండో కేసులో 38 ఏళ్ల వ్యక్తికి తలనొప్పి, జ్వరంతో గతేడాది నవంబరు 4న పాజిటివ్ వచ్చింది. 22న మళ్లీ జ్వరం రావడంతో కొవిడ్ పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. రెండు వైరస్ జన్యుక్రమాలను విశ్లేషించగా మూడు ప్రత్యేకమైన వైవిధ్యాలను గుర్తించారు. ఇది ఊహించిన దానికంటే ఎక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ కేసులో రోగనిరోధక శక్తి లేకపోవడమే రెండోసారి కొవిడ్‌బారిన పడటానికి ఉన్న అవకాశాన్ని శాస్త్రవేత్తలు తోసిపుచ్చడం లేదు.
- రెండు కేసుల్లో 4 వైరల్ జన్యువులు 20బి క్లాడ్‌కు చెందినవే. స్పైక్‌లో డి614జి ఉత్పరివర్తనం కలిగి ఉన్నాయి. రెండోసారి కొవిడ్ బారిన పడినప్పుడు ‘ఎస్, ఈ’ జన్యువుల్లో తేడా కన్పించలేదు. దీన్ని బట్టి స్పైక్ ప్రొటీన్లలో మార్పులు లేకున్నా అరుదుగా రీఇన్‌ఫెక్షన్‌కు అవకాశం ఉందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. క్లినికల్ ఇన్‌ఫెక్షన్స్ డిసీజెస్ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. కులకర్ణి, సునీత నర్రెడ్డి, లుమక్ జవేరి, ఐరావతి గౌడ్ కలాల్, కార్తీక్ భరద్వాజ్ తాళ్లపాక, దివ్యతేజ్ సౌపాటి పరిశోధనలో పాలుపంచుకున్నారు.
- ఇదీ చూడండి: తెలంగాణ : నడిరోడ్డుపై న్యాయవాద దంపతుల దారుణ హత్య