అమెరికాలో పుట్టి ప్రపంచ ప్రజానీకం నాడిని పట్టుకోగలిగింది ఫేస్బుక్. పదిహేనేళ్లలో 232 కోట్ల జనాభాతో మమేకమైంది. ఈరోజు సామాజిక బంధాలను మార్చే స్థితికి వచ్చిందంటే కారణం ప్రజలు ఆ బుక్‌పై పెంచుకున్న ప్రేమే..ఈ మధ్య కాలంలో ఎన్నో ఆరోపణలు, అవాంతరాలు ఎదుర్కొంటున్న వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్...దీన్ని 2004లో ప్రపంచానికి పరిచయం చేశాడు. కాని ఇతడినే సీఈవో స్థానం నుంచి వైదొలగాలంటూ వ్యతిరేకత వ్యక్తమవడం ఎంత చిత్రమో కదా...!
- జుకెర్ 'బుక్' ప్రస్థానం:
అమెరికాకు చెందిన మార్క్ జుకర్‌బర్గ్ పంతొమ్మిదేళ్ల వయస్సులో... ఫిబ్రవరి 4, 2014న ఓ వెబ్సైట్ రూపొందించాడు. దాని పేరే ఫేస్బుక్. విడుదల చేసిన 24 గంటల్లో తన కళాశాల విద్యార్థులు వేయి మంది భాగస్వాములయ్యారు. జుకర్ తమ ఐడియాను కాపీ కొట్టాడంటూ ప్రారంభించిన వారం రోజుల్లోనే హార్వర్డ్‌కు చెందిన కేమరూన్, టైలర్, దివ్య నరేంద్రలు ఆరోపించారు. నాలుగు సంవత్సరాల తరవాత ఆ కేసు కొంతమొత్తంతో పరిష్కారమైంది.
పూర్తిస్థాయిలో 2006 సెప్టెంబరులో అందుబాటులోకి వచ్చింది ఫేస్బుక్. మంచి జోష్ మీదున్న వెబ్‌సైట్‌ను కొనేందుకు యాహూ సంస్థ రూ. 71వేల కోట్ల రూపాయలు ఇస్తానని ఆశచూపింది. అందుకు జుకెర్‌బర్గ్ అంగీకరించలేదు. సరిగ్గా 2009లో ఐదేళ్లు నిండేసరికి ఫేస్బుక్ లాభాల్లో దూసుకెళ్లడం ప్రారంభించింది. 2010లో మైస్పేస్ అనే సైట్నూ కలుపుకొని ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్‌గా అవతరించింది. 2011లో ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ సంస్థ గూగుల్ ప్లస్‌ను ప్రారంభించింది. అది విఫలమైంది. గూగుల్ ఆ నెట్‌వర్క్‌ను ఈ ఏడాది పూర్తిగా మూసేసింది.
- 2012 మార్చి 18, ఫేస్బుక్ పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లింది. లక్షా 14వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించి అమెరికా చరిత్రలో మూడో పెద్ద ఐపీవోగా రికార్డుల్లోకెక్కింది. 2012లో 71వేల కోట్ల రూపాయలు పైగా చెల్లించి ఇన్‌స్టాగ్రామ్‌ను సొంతం చేసుకొంది ఈ దిగ్గజ సంస్థ. 2012 అక్టోబరు 4 నాటికి 100 కోట్ల నెటిజన్లను సభ్యులుగా మార్చుకుంది. 2014లో సుమారు 19 వందల కోట్ల రూపాయలు చెల్లించి మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కలిపేసుకుంది. 2017 జూన్ కల్లా 200కోట్ల సభ్యుల మైలురాయిని దాటింది.
2018 మార్చి 17న యూకే సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా దుర్వినియోగం కేసులో ప్రధానపాత్ర పోషించినట్లు ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వచ్చాయి. సుమారు 87 కోట్ల ఖాతాల్లోని సమాచారం అనుమతి లేకుండా అమ్ముకున్నట్లు కేసు నడుస్తోంది. 2016 అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసినట్టు తేలింది. ఇన్ని కేసులు వచ్చినా, ఫేస్‌బుక్‌ను తొలగించాలని ఎన్నో చర్చలు నడిచినా 50వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు 15వ వార్షికోత్సవం సందర్భంగా వెల్లడించింది టెక్ సంస్థ.