సహజ అందాలకు నెలవుగా... శిల్ప సంపదకు కొలువుగా భాసిల్లుతూ.. యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్పకు పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తుండగా.. హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు పొటెత్తుతున్నారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రామప్పను వీక్షించేందుకు పర్యటకులు తరలివస్తారు.
పర్యటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్యాకేజీలు..
దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ.. రామప్పకు వచ్చే పర్యటకుల కోసం పరిసర ప్రాంతాల్లో సకల సౌకర్యాల కల్పనకు సిద్ధమైంది. ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న 12 గదుల హరిత హోటల్‌ను వంద గదులకు విస్తరించాలని నిర్ణయించింది. ఇక సందర్శకుల కోసం.. ప్రత్యేక ప్యాకేజీలను కూడా తీసుకురావాలని యోచిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ బస్సులు నడిపేందుకు.. టీఎస్‌టీడీసీ సన్నాహాలు చేస్తోంది.
శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు..
ఇప్పటివరకు రామప్పను సందర్శించాలంటే.. ఎలాంటి బస్సులూ లేవు. దీంతో సందర్శకులకు ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ.. రామప్పకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో హన్మకొండ నుంచి రామప్పకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
పర్యటకుల స్పాట్‌గా...
ఇప్పటికే ఆ సుందర ప్రదేశాన్ని చూసేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలు వెళ్తుంటారు. ఎప్పుడూ ఆ ప్రాంతం పర్యటకులతో కోలాహలంగా ఉంటుంది. వారాంతాల్లో పిల్లలతో పిక్నిక్ వెళ్లటానికి, దంపతులు సరదాగా గడిపడానికి, కుటుంబం అంతా కలిసి ఓ సుందర ప్రదేశానికి వెళ్లాలంటే.. శిల్పకళా, పురాతన కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలను ఇష్టపడే వారికి.. రామప్ప సరైన ప్రదేశం. అలాంటి రామప్ప స్థాయి.. ఇప్పడు అంతర్జాతీయమవటం వల్ల చాలా మంది సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అసలే చూడని వాళ్లు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటే.. ఇప్పటికే చూసినవాళ్లు కూడా ఆ అనుభూతిని మళ్లీ పొందేందుకు ఉవ్విళ్లూరుతుంటారు.
పెరగనున్న తాకిడి..
పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. వీలైనంత ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్పను చూసేందుకు వచ్చే రెండు మూడు నెలలు.. వరంగల్‌కు పర్యాటకుల తాకిడి పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా వచ్చే అవకాశం ఉండటం వల్ల ఇప్పుడు రవాణా వ్యవస్థకు డిమాండ్ పెరగనుంది.
ఇవీ చూడండి: