ధీ అంటే బుద్ధి... యానం అంటే ప్రయాణం... బుద్ధితో కలిసి చేసే ప్రయాణాన్నే ధ్యానం అంటారు. భావనామయ జగత్తులో... శివుడి పట్ల బుద్ధిని నిలిపి ధ్యానం చేయడానికి... మిక్కిలి అనుకూలమైన కాలం కార్తికమాసం. సాక్షాత్తూ పరమశివుడితో అద్వైతస్థితిని అనుగ్రహించే... సమయమిది. కార్తికమాసాన్ని శివారాధనతో సద్వినియోగం చేసుకున్న వివేకవంతుడు... అజ్ఞానమనే పైపొరను వదులుకుని మోక్ష అర్హత సాధిస్తాడు. జన్మజన్మల పాపాలను హరించి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తికం. స్నాన, దాన, జపాలు, పూజలు, వనభోజనాలు, దీపారాధనతో ఈ మాసంలో నిత్య పూజలు చేయాలి. ఈ నియమాలు పాటించడం వల్ల ముక్కంటి అనుగ్రహం పొంది తరించవచ్చని శాస్త్రం చెబుతోంది.
కార్తిక స్నానాలు
భక్తులంతా మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుఝామునే తలస్నానం చేసి, శివాలయానికి వెళ్లి.. భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు పొందవచ్చు. ఈ మాసంలో దేశం నలుమూలలా శివాలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. మహాశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తిక మాసంలో శివారాధన చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయి.
కార్తిక దీపాలు
దీపాలను వెలిగించడమంటే.. మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ప్రసాదించాలని ఈశ్వరుడిని వేడుకోవడమే. దీపం ఎప్పుడూ అధో దిశ వైపు చూడదు. ఊర్ధ్వ దిశనే సూచిస్తుంది. మనిషి కూడా ఆ కాంతిలో ఉన్నతమైన ఆలోచనలతో అభ్యుదయ దిశవైపు పయనించాలనే సంకేతం ఇస్తుంది. 'జ్యోతి స్వరూపమైన ఓ పరమాత్మా! నీవు ఆ కవుల్లో కవిగా మర్త్యజీవుల్లో అమృతుడివిగా భాసిస్తావు. నీ వల్ల మా దుఃఖాలు తొలగుగాక!' అని రుగ్వేదంలో దీపకాంతిని గురించిన ప్రార్థన ఉంది. సార్వకాలీనమైన దైవం దీపం. దీపానికి నమస్సునర్పిస్తే సకలదైవాలను ప్రార్థించినట్లే. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి రోజు ముఖ ద్వారానికి రెండువైపులా సాయంత్రాలు దీపాలు వెలిగిస్తే మంచిది. శివాలయం ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
కార్తిక సోమవారాలు
కార్తిక సోమవారాలు చాలా పవిత్రమైనవి. సోమవారం, కార్తికమాసం రెండూ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ రోజుల్లో సాయంత్రాలు శివాలయంలో ఉసిరికాయపై వత్తులు పెట్టి దీపం వెలిగించాలి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నెయ్యి, అవిశనూనె, ఇప్పనూనె, ఆముదం ఏవైనా దీపం వెలిగించడానికి వాడొచ్చు.
కార్తిక పౌర్ణమి
కార్తిక మాసంలో ముప్పై రోజుల్లో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజు తప్పక దీపం పెడితే మంచిది. ఈ మాసంలో దీపం దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని విశ్వాసం.
ఉపవాసం.. శివానుగ్రహం
కార్తిక సోమవారం ఉపవాసం ఆచరించి, రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేసినవాళ్లు ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందుతారని కార్తిక పురాణంలో ఉంది.
వన భోజనం
కార్తిక సోమవారం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. పండితులను సత్కరించిన తర్వాత భోజనం చేయాలి. ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి సర్వ పాపాలు నశిస్తాయని నమ్మకం. వనభోజనాలు నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
తులసి పూజ
పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపు వత్తులతో దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత 365 వత్తులతో హారతివ్వాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.