తెలంగాణ జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ శివారులో హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు రాచర్ల పవన్‌కుమార్(38)ను సమీప బంధువులే సోమవారం రాత్రి సజీవ దహనం చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. జగిత్యాలకు చెందిన విజయ్.. కొండగట్టుకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో మంజునాథ ఆలయాన్ని, దాని పక్కనే కుటీరాన్ని నిర్మించుకున్నారు. 12 రోజుల కిందట విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందారు.
విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్‌కుమార్, భార్య కృష్ణవేణితో కలిసి సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మంజునాథ ఆలయానికి చేరుకున్నారు. పవన్‌కుమార్ చేతబడి చేయించి తన భర్తను చంపించాడనే అనుమానంతో అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత ఆయన్ని కుటీరంలోని ఓ గదిలో బంధించింది. ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఈ మేరకు మృతుని భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి గది తాళం తీసే సరికే పవన్‌కుమార్ పూర్తిగా దహనమయ్యాడని సీఐ కిషోర్ తెలిపారు.
గది బయట తాళం వేసి ఉండటాన్ని బట్టి మరికొందరు కూడా ఈ అఘాయిత్యంలో పాలుపంచుకుని ఉంటారనే అనుమానాన్ని సీఐ వ్యక్తంచేశారు. జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మంగళవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు.