తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలోని బావిలో తేలిన మృతదేహాల కేసు గుట్టును పోలీసులు ఛేదిస్తున్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి.. బతికుండగానే వారిని బావిలోకి తోసేసినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రెండు మృతదేహాల్లో మాత్రం ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించడం లేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. మత్తులో ఉన్నప్పుడు ఈడ్చుకొచ్చి బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఈడ్చుకు వచ్చినట్టుగా వారి శరీరంపై ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
3 సెల్‌ఫోన్లు స్వాధీనం, కాల్‌డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు. పది బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. మరోసారి బావిలోకి దిగి ఆధారాల కోసం వెతుకుతున్నారు. అన్ని నివేదికలు క్రోడీకరించాకే తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో రెండు ఫోరెన్సిక్ నివేదికల కోసం అధికారులు చూస్తున్నారు.