మాజీ ఆర్మీ అధికారినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మోసం చేసిన ఆనందవర్ధన్ అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజిగిరికి చెందిన ఆనందవర్ధన్... సాఫ్ట్వేర్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడు. తనకు తానుగా మాజీ ఆర్మీ అధికారినంటూ నమ్మించాడు. ఎన్ఐఏ, రా, ఐబీకి ఏజెంట్గా పనిచేస్తున్నట్లు సదరు మహిళను నమ్మించాడు.
ఇదివరకే వివాహమైందని, విడాకులు కూడా తీసుకున్నట్లు నమ్మించి... సాఫ్ట్వేర్ ఉద్యోగినిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లోని 50తులాల బంగారాన్ని చోరీ చేశాడు. దొంగలు బంగారు నగలు ఎత్తుకెళ్లారని నమ్మించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నకిలీ ఫిర్యాదు కాపీని మహిళకు చూపించాడు. పనిమీద గోవా వెళ్తున్నానని చెప్పి... అక్కడ హత్యకు గురైనట్లు నాటకాలాడాడు. ఈ మేరకు ఆర్మీ అధికారుల పేరుతో మహిళకు మెయిల్ చేశాడు. ఆనందవర్థన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఆర్మీ అధికారుల పేరుతో ఆనంద్ మెయిల్ చేశాడు.
అనుమానం వచ్చిన మహిళ అక్టోబర్ 31వ తేదీ నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు... దర్యాప్తు చేపట్టి అతని నాటకాన్ని బయటపెట్టారు. ఆనంద్ ఇలా ఎంతమంది మహిళలను మోసం చేశాడో తెలుసుకోవడానికి అతన్ని కస్టడీలోకి తీసుకుంటామని నార్సింగి సీఐ గంగాధర్ తెలిపారు.