హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం చెందడం కలకలం రేపింది. మాదాపూర్‌లోని ఓ వసతి గృహంలో నివసించే కాట్రగడ్డ సంతోష్, భరద్వాజ్, పవన్, రోషన్, మనోహర్ కలిసి కారులో వెళ్తుండగా.. టిప్పర్ ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా 25 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం. వీరిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సంతోష్ టెక్ మహేంద్ర సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మిగతా వారితో కలిసి మాదాపూర్‌లోని ఓ వసతి గృహంలో నివసిస్తున్నాడు.
సిగ్నల్ జంప్
వీరంతా ఈ తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో గచ్చిబౌలి నుంచి కారులో గౌలిదొడ్డి వైపు వెళ్తున్నారు. విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. కానీ వారు సిగ్నల్ జంప్ చేసి వెళ్లారు. ఇదే సమయంలో గ్రీన్ సిగ్నల్ పడి వస్తున్న టిప్పర్ వీరి కారును వేగంగా ఢీకొట్టింది. కారు, టిప్పర్ రెండు రోడ్డుపై పల్టీలు కొట్టాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది. నలుగురు అక్కడికక్కడే చనిపోగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
కారు అతి వేగంతో ఉంది
ప్రమాదం జరిగిన సమయంలో కారు అతి వేగంతో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లను పట్టించుకోకుండా కారును ముందుకు పోనివ్వటంతో... ఎదురుగా వస్తున్న టిప్పర్... కారును ఢీకొన్నట్లు చెప్పారు. మృతి చెందిన వారిలో కాట్రగడ్డ సంతోష్ ఏపీలోని పశ్చిమ గోదావరికి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెం వాసి కాగా.. కొల్లూరు పవన్‌కుమార్, నాగిశెట్టి రోషన్ నెల్లూరు, పప్పు భరద్వాజ్ విజయవాడలోని అజిత్ సింగ్‌నగర్, చింతా మనోహర్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి వాసిగా గుర్తించారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా శవాగారానికి తరలించారు. అతివేగం, సిగ్నల్ జంప్ చేయడం ఎంత ప్రమాదమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ఇదీ చదవండి: ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి