గుంటూరు జిల్లా తెనాలి పట్టణం నందులపేటలోని ఓ బార్ ఆండ్ రెస్టారెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. రఫీ అనే వ్యక్తి తన స్నేహితుడు బాజితో కలిసి సుభాని అనే యువకుడిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న తెనాలి రెండో పట్టణ పోలీసులు వివరాలు సేకరించారు. నిందితులు పోలీసుల అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెనాలి సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు.
మిత్రులే...శత్రువులయ్యారు
నందులపేటకు చెందిన సుభాని (24) గతంలో వెండి పని చేసేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక కొద్ది నెలలుగా ఆటో నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రఫీ, సుభాని స్నేహితులు. గత ఏడాది రఫీ వద్ద సుభాని రూ.15 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత రఫీ పలుమార్లు తన దగ్గర తీసుకున్న అప్పుతో పాటు వడ్డీ వెయ్యి రూపాయలతో రూ.16 వేలు చెల్లించాలని ఆడుగుతున్నా.. సుభాని పట్టించుకోలేదు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం సుభాని వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని లాక్కున్న రఫీ దానిని తాకట్టు పెట్టాడు. అప్పటినుంచి ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరినొకరు చంపేస్తామంటూ హెచ్చరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా సుభాని తన మీద దాడి చేస్తాడని భావించిన రఫే ముందడుగు వేసి హత్యకు ప్రణాళిక వేశారు.
ప్రణాళిక ప్రకారమే...
రఫీ.. బాజి ఆనే మరో స్నేహితుడితో కలిసి శుక్రవారం రాత్రి మాట్లాడుకుందామని బార్‌కు సుభానిని పిలిపించారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అర్ధరాత్రి సమయంలో అనుకున్న ప్రణాళిక ప్రకారం రఫీ, సుభానిపై దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా పలుమార్లు పొడిచాడు. సుభాని రక్తపు మడుగులో పడిపోయాడు. తొలుత గది నుంచి బయటకు వెళ్లిన రఫీ తిరిగి వచ్చి సుభానిని మరోమారు పొడిచి.. కత్తిని అతని వీపులో దించి వెళ్లాడు.
సీసీ కెమెరా ఆధారంగా...
సమాచారం అందుకున్న తెనాలి రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ హత్య గురించి బార్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని తెనాలి సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: