తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరంలో ఓ అమానుష ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు ఓ ఇంట్లో పని మనిషిగా చేరిన 13 ఏళ్ల బాలికపై ఆ ఇంటి యజమాని కుమారుడు కర్కశంగా ప్రవర్తించాడు. అత్యాచారయత్నానికి పాల్పడగా ప్రతిఘటించిందనే కోపంతో పెట్రోల్ పోసి హత్య చేసేందుకు యత్నించాడు. నిందితునిపై పోక్సో, అత్యాచారయత్నం, హత్యాయత్నం, బెదిరింపుల చట్టం కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ తెలిపారు.
రహస్యంగా ఆస్పత్రికి తరలింపు
ఖమ్మం గ్రామీణ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం తమ 13 ఏళ్ల రెండో కుమార్తెను నగరంలోని అల్లం సుబ్బారావు ఇంట్లో మే నెలలో పనికి కుదిర్చారు. గత నెల 18న తెల్లవారుజామున ఆయన కుమారుడు మారయ్య(28) బాలిక నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక ప్రతిఘటించడంతో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత నిందితుడు అతడి కుటుంబ సభ్యులు రహస్యంగా ఆస్పత్రికి తరలించారు.
పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి ఘటన
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 17 రోజులుగా బాధితురాలు 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు సోమవారం ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అదనపు డీసీపీ పూజా, ఏసీపీ అంజనేయులు ఆస్పత్రిలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలికను ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారం రాత్రి ఖమ్మం సీపీ తప్సీర్ ఇక్బాల్ ప్రభుత్వాస్పత్రిలో బాధిత బాలికతో మాట్లాడారు. ఈ ఘటనలో ప్రైవేట్ ఆస్పత్రి ప్రమేయంపై డీఎంఅండ్‌హెచ్‌వో మాలతి ఆధ్వర్యంలో విచారణకు సీపీ ఆదేశించారు.
ఎందుకు ఆలస్యమైంది?
17 రోజుల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి రావడం వెనక కారణాలపై స్పష్టత రాలేదు. రెండు వర్గాలవారు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో విషయం బహిర్గతమైనట్లు సమాచారం. కాలిన గాయాలతో బాలికను ఆస్పత్రిలో చేర్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రి వర్గాలు ఎందుకు దాచిపెట్టాయన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 18న ఉదయం పూజగది నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చిన బాలికకు మంటలు అంటుకుంటే తామే ఆర్పి ఆస్పత్రికి తరలించామని ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం వాదిస్తోంది.
ఇదీ చదవండి: నదీ జలాల వివాదం: నేడు అపెక్స్ కౌన్సిల్ కీలక సమావేశం