మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో ఈ నెల 7న జరిగిన బైక్ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో గత బుధవారం కారు బోల్తా పడి నలుగురు బడంగ్‌పేటవాసులు మృత్యువాతపడ్డారు.
తాజాగా గచ్చిబౌలి వద్ద జరిగిన మరో ఘోర ప్రమాదంలో అయిదుగురు యువకులు మృతిచెందారు. అన్నింటికీ అతి వేగమే కారణమని తేలింది. మృతుల్లోనూ యువతరమే అధికంగా ఉంటోంది. గతంలోని గణాంకాలూ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
యువకులు.. నడి వయస్కులే అధికం
రోడ్డు ప్రమాద మృతుల్లో యువతే అధికంగా ఉంటున్నారు. 25-35 ఏళ్ల లోపు వారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. వీరిది మొత్తం మృతుల్లో 28.7శాతం. వీరి తర్వాత అత్యధికంగా మరణిస్తున్న వారు 35-45 ఏళ్లలోపు నడి వయస్కులు వీరిది 24.49శాతం.
2019 సంవత్సరంలో...
తెలంగాణ రోడ్డు భద్రతా విభాగం గణాంకాల ప్రకారం 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 21,570 ప్రమాదాలు సంభవించాయి. 6,964 మంది మృత్యువాత పడగా.. 21,999 మంది క్షతగాత్రులయ్యారు. రోజుకు సగటున 59 ప్రమాదాల్లో 19 మంది మరణించారు. అతి వేగం వల్ల సంభవించిన ప్రమాదాలే 20,669 ఉండటం గమనార్హం. ఇవి 95.8 శాతం. అతి వేగం కారణంగా జరిగిన ఈ ప్రమాదాల్లోనే 6,739 (96.76శాతం) మంది మరణించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 860 మంది చనిపోగా.. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 58 మంది చనిపోయారు.