ప్రభుత్వాన్ని రద్దు చేసే విధంగా సభ్యులు చేసిన ప్రాథమిక ప్రతిపాదనను ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ తీర్మానం 61-54 ఓట్ల తేడాతో పార్లమెంట్ ఆమోదం పొందింది.
ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో పాలుపంచుకున్న బ్లూ అండ్ వైట్ పార్టీ.. తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. నెతన్యాహు సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించింది.
పార్లమెంట్ రద్దు కావాలంటే ఈ బిల్లును క్నెసెట్(పార్లమెంట్) కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో రెండు సార్లు ఓటింగ్ జరగాల్సి ఉంటుంది.
ఇదే జరిగితే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో పార్లమెంట్‌కు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇవి రెండేళ్ల వ్యవధిలో నాలుగోసారి జరిగే ఎన్నికలుగా నిలుస్తాయి.
అయితే ఈ ప్రతిపాదనపై చివరి విడత ఓటింగ్ తప్పించేందుకు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు ప్రధాన పార్టీల(లికుడ్, బ్లూ అండ్ వైట్) మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.