పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనా శరణార్థుల కోసం పని చేసే ఐక్యరాజ్య సమితి రలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ)కి 10 మిలియన్ డాలర్లు(రూ.75.61కోట్లు) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది భారత్. వచ్చే రెండేళ్లలో ఈ నిధులను సమకూర్చనున్నట్లు తెలిపింది. నైపుణ్య శిక్షణ, మన్నికైన సంస్థలను నిర్మించటం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచటమే ఈ సహాయ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేసింది.
యూఎన్ఆర్డబ్ల్యూఏ నిధుల సమీకరణపై జరిగిన వివిధ దేశాల మంత్రుల సమావేశంలో ఈ సాయం ప్రకటించారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్.
" పాలస్తీనా ప్రజలు తమ దేశం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి గౌరప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆతిథ్య దేశాలు, దాతలు, యూఎన్ఆర్డబ్ల్యూఏల నిరంతర కృషిని భారత్ అభినందిస్తోంది. కరోనా కేసులు పెరుగుతూ.. వైద్య సామగ్రికి దేశీయంగా డిమాండ్ ఉన్నా ఔషధాలు, వైద్య సామగ్రిని అవసరమైన పలు దేశాలకు భారత్ సాయంగా అందించింది. వచ్చే వారం నాటికి పాలస్తీనాకు వైద్య సామగ్రి, ఔషధాలను పంపిస్తాం. సాధారణ శిక్షణ కార్యక్రమాలతో పాటు పాలస్తీనా యువతకు ఏటా 250 మందికి ఉపకారవేతనాలు అందిస్తున్నాం. ప్రస్తుతం దాని విలువ 72 మిలియన్ డాలర్లుగా ఉంది."
- మురళీధరన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి.
యూఎన్ఆర్డబ్ల్యూఏకు మరింత మద్దతు అవసరమని పేర్కొన్నారు మురళీధరన్. పలు దేశాలు తమ సహకారాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ.. భారత్ సాయాన్నిపెంచిందని గుర్తు చేశారు. గతంలో 1.25 మిలయన్ డాలర్లుగా ఉన్న సాయాన్ని 2018లో 5 మిలియన్ డాలర్లకు పెంచినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు అందించగా.. త్వరలోనే మిగతా 3 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని స్పష్టం చేశారు. వాటికి అదనంగా ఈ 10 మిలియన్ డాలర్లు అందిస్తున్నట్లు ప్రకటించారు.
యూఎన్ఆర్డబ్ల్యూఏ ప్రకారం పశ్చిమాసియా ప్రాంతాల్లో సుమారు 5.6 మిలియన్ మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు.
ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్.. ప్రపంచ దేశాల స్వప్నం