Russia Ukraine war: వీలైనంత త్వరగా తమ నిబంధనలను అంగీకరించాలని, లేనిపక్షంలో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌కు హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగింది ట్రయల్ మాత్రమేననీ.. యుద్ధభూమిలో మాస్కో సేనలు ఇంకా తమ అసలైన చర్యను ప్రారంభించనే లేదు అని అన్నారు. 'ఉక్రెయిన్ ప్రజలకు ఇది విషాదం లాంటిదే.. కానీ, ప్రస్తుత పరిణామాలు ఈ దిశగానే వెళ్తున్నట్లు కనిపిస్తోంద'ని పుతిన్ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.
చర్చలకు సిద్ధమే
పశ్చిమ దేశాలు శత్రుత్వానికి ఆజ్యం పోస్తున్నాయిని పుతిన్ ఆరోపించారు. యుద్ధం ముగింపు కోసం తాను చర్చలు జరిపేందుకు సిద్ధమేనన్నారు. కానీ, ఈ ప్రక్రియ ఎంత ఆలస్యమైతే తమతో ఒప్పందం చేసుకోవడం కూడా అంతే కష్టమవుతుందని హెచ్చరించారు.
సైనిక చర్య పేరిట ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ దేశ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన మాస్కో సేనలు.. ఇటీవల లుహాన్స్క్‌పై పట్టు సాధించాయి. ఇరు దేశాల మధ్య దాదాపు నాలుగున్నర నెలలుగా కొనసాగుతోన్న యుద్ధం.. ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు భీకర దాడులతో క్రెమ్లిన్ సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది పౌరులు దేశాన్ని విడిచి వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభం ఇదే. మరోవైపు రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, బ్రిటన్‌తోసహా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇవీ చదవండి: