అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీ (82)పై ఓ దుండగుడు (42) సుత్తితో దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కోలోని వీరి ఇంట్లోకి చొరబడిన ఆగంతుకుడు పాల్‌ను తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో నాన్సీ పెలోసీ ఇంట్లో లేకపోవడంతో.. 'నాన్సీ ఎక్కడ?’ అంటూ చుట్టూ వెదికాడు. గాయపడ్డ పాల్ ఆసుపత్రిలో కోలుకొంటున్నట్లు పెలోసీ అధికార ప్రతినిధి తెలిపారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని, దాడికి గల కారణాలను ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
పెలోసీ యూరప్ భద్రతా సదస్సులో పాల్గొని వాషింగ్టన్కు ఈ వారమే తిరిగి వచ్చారు. రెండేళ్ల కిందట జరిగిన హింసాత్మక ‘క్యాపిటల్’ ఘటన తర్వాత.. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, వారి కుటుంబాల భద్రతపై ఆందోళన పెరిగింది. అమెరికాలో మరో 11 రోజుల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. నేరాలు, ప్రజాభద్రత ఎన్నికల్లో ముఖ్యాంశాలుగా మారిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. స్పీకర్ నాన్సీ పెలోసీని అధ్యక్షుడు జో బైడెన్ ఫోను ద్వారా పరామర్శించి సంఘీభావం తెలిపారు.