Elon Musk: గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు సంబంధించి తాజాగా కొత్త వ్యవహారం బయటపడింది. ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సహాయకురాలితో అసభ్యంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రెండున్నర లక్షల డాలర్లు చెల్లించి స్పేస్‌ఎక్స్ సెటిల్‌మెంట్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అసత్యాలు అంటూ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. 2016లో ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తన సొంత సంస్థలో పనిచేస్తోన్న సహాయకురాలితో ఎలాన్ మస్క్ అసభ్యంగా ప్రవర్తించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ కథనం వెల్లడించింది. ఫ్లైట్ ప్రైవేటు రూమ్‌లో బాధితురాలిని అసభ్యకరంగా తాకడంతోపాటు.. నచ్చిన విధంగా మసాజ్ చేస్తే ఓ గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని మస్క్ చెప్పినట్లు వివరించింది. ఈ వివరాలను బాధితురాలి స్నేహితురాలు బహిర్గతం చేసినట్లు ఇన్‌సైడర్ కథనం పేర్కొంది. ఆ సమయంలో మస్క్ ప్రతిపాదనను తిరస్కరించిన బాధితురాలు స్పేస్‌ఎక్స్‌లో తన ఉద్యోగం పోతుందని ముందుగానే ఊహించినట్లు తెలిపింది. ఈ విషయంపై 2018లో ఓ లాయర్‌ను నియమించుకొని న్యాయపరంగా కేసును ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తాజా కథనం వెల్లడించింది.
కోర్టు బయటే సెటిల్‌మెంట్.. అయితే, ఈ లైంగిక ఆరోపణలకు సంబంధించి 2018లో బాధితురాలికి రెండున్నరల లక్షల డాలర్లు ($2,50,000) చెల్లించి ఈ వ్యవహారాన్ని స్పేస్‌ఎక్స్ సెటిల్ చేసుకుందని తాజా నివేదిక వెల్లడించింది. కోర్టు బయట జరిగిన ఈ సెటిల్‌మెంట్ వ్యవహారానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను బాధితురాలి స్నేహితురాలు చూపించినట్లు ఇన్‌సైడర్ కథనం పేర్కొంది. అంతేకాకుండా ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా బాధితురాలితో స్పేస్‌ఎక్స్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు తాజా కథనంలో వివరించింది.
అవన్నీ అబద్ధాలే.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు, సెటిల్‌మెంట్ వ్యవహారంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. తన స్నేహితురాలిని లైంగికంగా వేధించినట్లు చెబుతోన్న వ్యక్తి వాటిని నిరూపించగలరా. సవాల్ చేస్తున్నా.. అంటూ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. తనపై చేస్తోన్న దారుణమైన ఆరోపణలు పూర్తి అవాస్తవమంటూ ఎలాన్ మస్క్ వరుస ట్వీట్‌లు చేశారు. ఇదిలాఉంటే, తనపై ఇటీవలికాలంలో రాజకీయ దాడులు ఎక్కువయ్యాయని ఎలాన్ మస్క్ చెబుతూ వస్తున్నారు. రానున్న నెలల్లో ఇవి మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటూ ఇటీవల ట్వీట్ చేశారు. ఇలా చెప్పిన కొన్ని రోజులకే ఆయనపై లైంగిక ఆరోపణల వ్యవహారం బయటకు రావడం గమనార్హం.
ఇవీ చదవండి: లంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణ ఎగవేత- డ్యూటీలకు రావొద్దంటూ ఆదేశాలు!
కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. పాక్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్!