North Korea Missile Attack : అమెరికా, దక్షిణ కొరియాపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసిన ఉత్తర కొరియా ఆ వైపుగా అడుగులు వేసింది. దక్షిణ కొరియా సముద్రం వైపు ఏకంగా 23 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఉదయం 17, మధ్యాహ్నం ఆరు క్షిపణులు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ప్రయోగించిన క్షిపణులన్నీ స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసైళ్లు లేదా భూతలం నుంచి గగనతలాన్ని ప్రయోగించే క్షిపణులని తెలిపారు. ఇందులో పలు మిసైళ్లు తీరానికి దగ్గరగా వచ్చినట్లు తెలిపారు. అయితే, ఒకేరోజు 23 క్షిపణులను ప్రయోగించడం ఓ రికార్డు అని విశ్లేషకులు చెబుతున్నారు.
దక్షిణ కొరియా స్ట్రాంగ్ కౌంటర్
ఉత్తరకొరియా చేపట్టిన క్షిపణి ప్రయోగాలకు దక్షిణ కొరియా గట్టిగా బదులిచ్చింది. ఉత్తర కొరియా వైపు మూడు క్షిపణులను ప్రయోగించింది. ఉదయం కిమ్ దేశం క్షిపణులు ప్రయోగించిన గంటల్లోనే ఈ చర్యకు పూనుకుంది. అదేసమయంలో తమ దేశంలో హైఅలర్ట్ ప్రకటించింది దక్షిణ కొరియా. తీర ప్రాంత వాసులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. పలు గగనతల మార్గాలను మూసివేసింది. గురువారం ఉదయం వరకు ఇవి మూసే ఉంటాయని ప్రకటించింది.
అంతకుముందు తమపై దండయాత్ర జరపాలనే దురుద్దేశంతోనే అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు పాల్పడుతున్నాయనీ, దీనికి తమవైపు నుంచి శక్తిమంతమైన ప్రతి చర్యలు ఉంటాయని ఉత్తర కొరియా విదేశాంగశాఖ హెచ్చరించింది. ఆ ప్రతిచర్యలు ఏమిటో వివరించకపోయినా, 2017 సెప్టెంబరు తరవాత తొలి అణ్వాయుధ పరీక్షను మరికొన్ని వారాల్లో నిర్వహించేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.
దక్షిణ కొరియా సైన్యం ఏటా నిర్వహించే 12 రోజుల అభ్యాసాలను ఇటీవలే ముగించింది. అందులో అమెరికన్ సైనికులూ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఉభయ దేశాల యుద్ధ విమానాల విన్యాసాలు ఆరంభమయ్యాయి. వచ్చే శుక్రవారం వరకూ ఇవి కొనసాగుతాయి. 200 యుద్ధ విమానాలు పాల్గొంటున్న ఈ సంయుక్త విన్యాసాల్లో అత్యాధునిక ఎఫ్-35 విమానాలు కూడా భాగమయ్యాయి. కొవిడ్‌కు తోడు.. ఉత్తర కొరియాతో దౌత్య సంప్రదింపులకు అనుకూల వాతావరణం ఏర్పరచాలన్న తలంపు వల్ల కొన్నేళ్లుగా అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలను నిలిపేశాయి. అయితే ఉత్తర కొరియా ఈ ఏడాది 40 క్షిపణి పరీక్షలు జరపడంతో తమ విన్యాసాలను మళ్లీ ప్రారంభించాయి. సెప్టెంబరు నుంచి ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను ముమ్మరం చేయడంతోపాటు.. దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలపై అణు క్షిపణులను ప్రయోగించేందుకు ముందస్తు కసరత్తు కూడా చేపట్టింది.