SCO Summit 2022: ఉజ్బెకిస్థాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమర్‌ఖండ్ చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఉజ్బెకిస్థాన్ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్ ఘన స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత దీన్ని నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ విషయంలో చైనా దూకుడు క్రమంలో జరుగుతున్న ఈ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో.. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై ఈ కూటమికి చెందిన సభ్య దేశాల నేతలు చర్చించనున్నారు.
జిన్‌పింగ్‌తోనూ చర్చలు జరుపుతారా?
ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పుతిన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావత్ మిర్జియోయెవ్‌లతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. అయితే, జిన్‌పింగ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత.. పుతిన్‌తో జిన్‌పింగ్ ఇక్కడ నేరుగా భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
ఉగ్రవాదం సహా ప్రాంతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారని, ఉగ్రవాద సమస్య మూలాలు ఎక్కడున్నాయన్నది ఈ బృందానికి లోతైన అవగాహన ఉందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్ర పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చిస్తా: ప్రధాని
ఉజ్బెకిస్థాన్‌కు బయల్దేరి వెళ్లడానికి ముందు మోదీ మాట్లాడుతూ.. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వివిధ దేశాల అధినేతలతో అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పారు. ఈ కూటమిని మరింత విస్తృతం చేయడం; పరస్పర, బహుముఖ ప్రయోజనాల నిమిత్తం కూటమిలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తానన్నారు. పర్యాటక, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
ఇవీ చదవండి: భర్త సమాధి వద్దే ఎలిజబెత్-2 ఖననం.. రాణి నివాళికి వేలాది మంది బ్రిటన్ పౌరులు
పుతిన్‌పై హత్యాయత్నం.. కారుపై బాంబు దాడి.. త్రుటిలో తప్పిన ప్రమాదం