మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పద్మభూషణ్ పురస్కారం స్వీకరించారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వం ప్రకటించిన 17 మంది పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్లో ఆయన ఒకరు. తాజాగా పురస్కారాన్ని అందుకున్న ఆయన.. భారత ప్రభుత్వ గుర్తింపు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి గతవారం ఆయన అవార్డు స్వీకరించినట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా తెలిపింది. ఈ సందర్భంగా నాగేంద్ర ప్రసాద్, నాదెళ్ల భేటీ అయినట్లు వెల్లడించింది. భవిష్యత్లో భారత్ సాంకేతిక ప్రపంచశక్తిగా ఎదిగే అవకాశాలపై ఇరువురు చర్చించినట్లు పేర్కొంది. భారత సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా నాదెళ్ల పేర్కొన్నారు.
'ఆర్థిక, సామాజిక, సాంకేతికంగా సంచలన మార్పులు జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. వచ్చే దశాబ్దం పూర్తిగా డిజిటల్ సాంకేతికతదే. భారత్లోని చిన్నాపెద్దా పరిశ్రమలు, సంస్థలు సాంకేతికతవైపు మళ్లుతున్నాయి. ఇది గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తుంది.'
-సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
సత్య నాదెళ్ల వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటించనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. తొమ్మిదేళ్ల తర్వాత ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి కానుంది. హైదరాబాద్లో జన్మించిన నాదెళ్ల.. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్నారు. 2021 జూన్లో ఆయన సంస్థకు ఛైర్మన్గా ఎంపికయ్యారు.