అనూహ్య మలుపులు తిరిగిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నిక ఫలితం వచ్చేసింది. మధ్యంతర ఎన్నికల తర్వాత ప్రతినిధుల సభలో స్వల్ప మెజారిటీ సాధించిన ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. స్పీకర్ పదవిని దక్కించుకుంది. తమ నేత కెవిన్ మెకార్థీని సభాపతిగా ఎన్నుకునేందుకు రిపబ్లికన్లు అయిదు రోజులుగా చేసిన ప్రయత్నాలు చివరికి సఫలమయ్యాయి. 15వ రౌండ్ ఓటింగ్ తర్వాత మెకార్థీ స్పీకర్‌గా గెలిచినట్లు ప్రకటించారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నికకు ఎక్కువ రౌండ్ల ఓటింగ్ నిర్వహించిన విషయంలో వందేళ్ల రికార్డు బద్దలైంది. అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన 82 ఏళ్ల నాన్సీ పెలోసీ స్థానంలో 57 ఏళ్ల కెవిన్ మెకార్థీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించిన 15వ రౌండ్ ఓటింగ్‌లో కెవిన్ మెకార్థీకి 216 ఓట్లు రాగా.. అధికార పార్టీకి చెందిన హకీమ్ సెకౌ జెఫ్రీస్‌కు 212 ఓట్లు వచ్చాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య కేవలం నాలుగు ఓట్ల తేడాతో కెవిన్ మెకార్థీ గెలిచినట్లు క్లర్క్ చెర్లి జాన్సన్ ప్రకటించగానే రిపబ్లికన్లు హర్షధ్వానాలతో సభను హోరెత్తించారు. ఈ ఎన్నిక..అమెరికా స్పీకర్ ఎన్నికల చరిత్రలో ఐదో సుదీర్ఘ పోటీగా నిలిచింది. అమెరికా చరిత్రలో 1855లో సుమారు రెండు నెలల పాటు 133 రౌండ్ల ఓటింగ్ కొనసాగిన తర్వాత స్పీకర్ ఎన్నిక ముగిసింది.
అంతకుముందు ఓటింగ్‌లో మెజార్టీ ఉన్నా రిపబ్లికన్లకు తిప్పలు తప్పలేదు. పరిస్థితులు వెంటవెంటనే మారుతుండడం ప్రతిపక్ష పార్టీని తీవ్ర కలవరానికి గురిచేసింది. మెకార్థీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న బృందానికి చెందిన మాట్ గేట్జ్.. ట్రంప్ పేరును స్పీకర్ పదవికి నామినేట్ చేశారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించగా ట్రంప్‌నకు అనుకూలంగా ఒకే ఒక్క ఓటు పోలైంది. అది కూడా మాట్ గేట్జ్ వేసిందే. 11వ రౌండ్ తర్వాత హౌస్ క్లర్క్ ఫలితాలను వెల్లడిస్తూ.. ట్రంప్ ఒకే ఒక్క ఓటు సాధించారని చెప్పగా, సభలోని వారంతా పగలబడి నవ్వారు.
మెకార్థీకి వ్యతిరేకంగా సుమారు 20 మంది సభ్యులు ఉండడంతో రిపబ్లికన్లకు ఏమీ పాలుపోలేదు. అనంతరం జరిగిన చర్చల్లో వ్యతిరేక బృందం మనసు మార్చుకుని మెకార్థీకి అనుకూలంగా ఓటు వేయడంతో రిపబ్లికన్లు ఊపిరి పీల్చుకున్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన నల్లజాతి సభ్యుడు జెఫ్రీస్ 12 దఫాల ఓటింగ్‌లో ప్రతిసారీ మెకార్థీ కన్నా ఎక్కువ ఓట్లు సాధించినా మెజారిటీ మాత్రం దక్కలేదు.సభలో రిపబ్లికన్లకు ఎక్కువ ఓట్లు, సీట్లు ఉండటమే దీనికి కారణం. అధికార డెమొక్రాట్లకు నాయకత్వం వహించిన మొదటి నల్లజాతి సభ్యుడిగా జెఫ్రీన్ చరిత్ర సృష్టించాడు.అమెరికాలో దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలి తర్వాత హోదాలో స్పీకర్ నిలుస్తారు. హౌజ్ స్పీకర్‌గా ఎన్నికైన మెకార్థీకి.. డోనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.