ఉక్రెయిన్‌పై సైనికచర్య కొనసాగుతున్న తరుణంలో వివిధ దేశాలతో కలిసి పెద్దఎత్తున రష్యా నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాలకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం హాజరయ్యారు. ఈనెల ఒకటోతేదీ ప్రారంభమైన ఈ విన్యాసాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. వస్టాక్-2022 పేరుతో భారీఎత్తున నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో భారత్, చైనా, లావోస్, మంగోలియా, నికరగ్వా, సిరియాసహా పలు మాజీ సోవియట్ యూనియన్ దేశాలు పాల్గొంటున్నాయి. రష్యాకు తూర్పున ఉన్న 7ఫైరింగ్ రేంజ్‌లతోపాటు జపాన్ సముద్రంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 50వేల సైనిక బలగాలు, 140యుద్ధ విమానాలు, 60యుద్ధనౌకలు సహా 5వేల ఆయుధాలు ప్రదర్శిస్తున్నారు.
ఈ విన్యాసాల కోసం చైనా 300మిలిటరీ వాహనాలతోపాటు 2వేల బలగాలు, 21యుద్ధ విమానాలు, 3యుద్ధనౌకలను పంపింది. డ్రాగన్ తొలిసారి ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు తన 3మిలిటరీ విభాగాల నుంచి సేనలను పంపింది. జపాన్ సముద్రంలో ఇరుదేశాల నౌకాదళాలు విన్యాసాలు చేశాయి. సముద్ర సమాచార వ్యవస్థలను కాపాడటం, తీరప్రాంతాల్లోని పదాతి దళాలకు సాయపడటమే లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది
రష్యా-చైనా మధ్య సైనిక సంబంధాల పెరుగుదలకు ఈ విన్యాసాలు అద్దం పడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత ఇరుదేశాల సైనిక సంబంధాలు పెరిగాయి. ఉక్రెయిన్‌పై సైనికచర్య విషయంలో మాస్కోను వెనకేసుకొచ్చిన డ్రాగన్..అమెరికా, నాటో దేశాల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. పశ్చిమ దేశాలు తమ చర్యలతో మాస్కోను రెచ్చగొట్టాయని ఆరోపించింది. రష్యాపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధించటాన్ని చైనా తీవ్రంగా ఆక్షేపించింది. అందుకు బదులుగా రష్యా కూడా తైవాన్ వ్యవహారంలో చైనాకు బాసటగా నిలిచింది. ఉక్రెయిన్‌పై సైనికచర్యలో తమ సైన్యం పాల్గొంటున్నసైనిక బలగాలతోపాటు ఆయుధ సంపత్తికి లోటు లేదని రష్యా ఈ విన్యాసాల ద్వారా చాటే ప్రయత్నం చేస్తోంది.
రష్యాకు ఉత్తర కొరియా శతఘ్ని గుళ్లు, రాకెట్లు : ఉత్తర కొరియా నుంచి భారీ మొత్తంలో శతఘ్ని గుళ్లు, రాకెట్లను సమకూర్చుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోందని అమెరికా నిఘా వర్గాల నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధం కోసం వీటిని రష్యా కొనుగోలు చేయనుందని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా రష్యా సైన్యానికి సరఫరాలు తగ్గి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందుకే మాస్కో తన అవసరాలను తీర్చుకోవడం కోసం ఉత్తర కొరియా వైపు చూస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఉత్తర కొరియా నుంచి అదనంగా సైనిక పరికరాలనూ కొనుగోలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా నిఘా వర్గాల నివేదిక విషయాన్ని 'న్యూయార్క్ టైమ్స్' తన కథనంలో వెల్లడించింది.
ఇదీ చదవండి: బ్రిటన్ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్.. నియమించిన క్వీన్ ఎలిజబెత్ 2