China Communist Party : వచ్చే నెల కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న నేపథ్యంలో పార్టీలో అవినీతిపరుల ఏరివేత ఊపందుకొంది. టిబెట్ స్వయంపాలిత ప్రాంత ప్రభుత్వ మాజీ ఉపాధ్యక్షుడు ఝాంగ్ యోంగ్జే లంచాలు తీసుకున్నట్లు గురువారం నిర్ధారించారు. ప్రాజెక్టు కాంట్రాక్టులు, పదోన్నతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా విలువైన బహుమతులు, పెద్దఎత్తున నగదు దండుకున్నారని జాతీయ పర్యవేక్షణ కమిషన్ తేల్చింది. ఝాంగ్‌పై ప్రాసిక్యూషన్ కార్యకలాపాలు మొదలుపెట్టింది.
పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే జాతీయ భద్రతాశాఖకు చెందిన అత్యున్నత అధికారి లియు యాన్ పింగ్ కూడా లంచాలు తీసుకొన్నట్లు బుధవారం నిర్ధారించారు. జిన్‌పింగ్ ప్రత్యర్థి వర్గానికి చెందిన మాజీమంత్రి సన్ లీజున్ భారీగా లంచాలు తీసుకున్నారని గత శుక్రవారం ఒక కోర్టు తేల్చింది. దానికి ఒకరోజు ముందు మాజీ న్యాయమంత్రి ఫూ ఝెంగ్ హువా కూడా అవినీతిపరుడని అదే కోర్టు తేల్చింది. లీజున్, ఝెంగ్ హువా, యాన్ పింగ్‌లకు మరణశిక్షలు విధించి రెండేళ్లపాటు శిక్ష అమలును నిలిపి ఉంచారు.
కోటీశ్వరుడిపై అత్యాచార ఆరోపణ
మినియాపోలిస్ మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక విద్యార్థినికి 2018లో మద్యం తాగించి మానభంగం చేశారని చైనా ఈ-కామర్స్ సంస్థ జెడి డాట్‌కామ్ వ్యవస్థాపకుడు రిచర్డ్ లియు(46)పై ఇక్కడి సివిల్ కోర్టులో విచారణ ప్రారంభమవుతోంది. 1990ల నుంచి చైనాలో ఇంటర్నెట్, ఈ-కామర్స్, మొబైల్ ఫోన్, ఇతర టెక్నాలజీ పరిశ్రమల విజృంభణకు కారకులైన వ్యవస్థాపకుల్లో లియు ఒకరు.
ఈయన సంపదను 1,150 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. ఉన్నతశ్రేణి చైనా వ్యాపార ప్రతినిధులకు మిన్నెసోటా వర్సిటీలో వారం రోజుల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు నిర్వహిస్తుంటారు. 2018లో ఈ కోర్సు కోసం రిచర్డ్ లియు విశ్వవిద్యాలయానికి వచ్చారు. అదే సమయంలో జింగ్యావో లియు (21) అనే చైనా విద్యార్థిని స్టూడెంట్ వీసాపై ఈ కోర్సులో వాలంటీరుగా చేరారు. 2018లో రిచర్డ్ లియు తనపై అత్యాచారం చేశారని ఈమె ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: శుక్రవారమే ఆ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. వారి హెచ్చరికలు బేఖాతరు
భారతీయులకు గుడ్న్యూస్.. ఇక మరింత ఈజీగా గ్రీన్ కార్డ్.. సెనేట్లో బిల్!