Hindu Temple: పాకిస్థాన్‌లో మరో హిందూ దేవాలయం దుండగుల దాడికి గురైంది. కరాచీ కోరంగి ప్రాంతంలోని శ్రీ మరీ మాతా మందిర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం దాడి చేశారు. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ప్రత్యక్షసాక్షి సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
'ఆలయంపై దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలియదు. కానీ ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు బైక్స్‌పై వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని సమీక్షించారు' అని సంజీవ్ అనే స్థానికుడు వెల్లడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఐదు నుంచి ఆరుగురు దుండగులు ఆలయంపై దాడి చేశారని.. పరారీలో ఉన్న వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఘటనాస్థలం సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
ఆలయాలపై దాడి జరగడం పాకిస్థాన్‌లో ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు దుండగుల దాడులకు గురయ్యాయి. గతేడాది అక్టోబరులో కోట్రీ ప్రాంతంలోని ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ఆగస్టులో భోంగ్లో జరిగిన మరో ఘటనలో పదుల సంఖ్యలో స్థానికులు ఆలయంపై దాడి చేశారు. ఓ బాలుడు ఓ వర్గానికి చెందిన పాఠశాల పరిసరాల్లో మూత్రవిసర్జన చేయడమే అందుకు కారణం. ఈ కేసులో బాలుడికి కోర్టు బెయిల్ ఇచ్చిందని ఆగ్రహించిన పలువురు ఈ చర్యకు పాల్పడ్డారు.
ఇదీ చూడండి : శ్రీలంకకు భారత్ సాయంపై చైనా ప్రశంసలు