ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ ప్రార్థనాలయం వద్ద సబ్బత్ వేడుకల్లో పాల్గొన్న పౌరులపై పాలస్తీనాకు చెందిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న చేరుకున్న ఇజ్రాయెల్ దళాలు దుండగుడిని హతమార్చాయి. అంతకుముందు వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తియన్ శరణార్థుల శిబిరంపై దాడిచేసిన ఇజ్రాయెల్ సైన్యం 10 మందిని కాల్చి చంపింది. అందుకు ప్రతీకారంగా అగంతకుడు ఈ దారుణానికి తెగబడ్డట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
రష్యా దాడిలో మరో 10 మంది మృతి
రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన 10 మంది పౌరులు మరణించగా.. మరో 20 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం శుక్రవారం తెలిపింది. మృతుల్లో ఖేర్సన్‌కు చెందిన ఇద్దరు, దోనెట్స్క్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉన్నారని వివరించింది.
అంతకుముందు గురువారం రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మృతి చెందారు. తమ దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించడానికి నిర్ణయించినట్లు అమెరికా, జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో రష్యా తన దాడులను ఉద్ధృతం చేసింది. పాశ్చాత్య దేశాలు తమతో కొత్త స్థాయి ఘర్షణకు దిగుతున్నాయని ఆరోపించింది. మరోపక్క తమ దేశంలో కలిపేసుకున్నట్లు ప్రకటించిన ఉక్రెయిన్ భూభాగాలైన దోనెట్స్క్, లుహన్స్క్, జపోరిజియా, ఖేర్సన్‌లను మాస్కో టైమ్ జోన్‌లోకి తీసుకువస్తున్నట్లు రష్యా అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకూ అవి కీవ్ టైమ్ జోన్‌లో ఉన్నాయి.