Egypt air Plane Crash: ఆరేళ్ల క్రితం ఈజిప్టుఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం సముద్రంలో కూలిపోయి 66 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగి కుప్పకూలినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ఇందుకు సంబంధించిన 134 పేజీల నివేదికను గత నెల పారిస్‌లోని అప్పీల్ కోర్టులో సమర్పించారు. ఈ వివరాలపై తాజాగా న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. కాక్‌పిట్‌లో ఉన్న పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీక్ అయ్యింది. ఫలితంగా కాక్‌పిట్‌లో మంటలు చెలరేగి విమానం కూలిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. ఘటన సమయంలో కాక్‌పిట్ సిబ్బంది అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్‌లో రికార్డ్ అయినట్లు దర్యాప్తులో తేలింది.
2016 మే నెలలో ఈజిప్టుఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం ఒకటి ప్రమాదానికి గురైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరోకు బయల్దేరిన ఈ విమానం గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలోని తూర్పు మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది.
ప్రమాదం సమయంలో విమానంలో సిబ్బంది సహా 66 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 40 మంది ఈజిప్టియన్లు, 15 మంది ఫ్రాన్స్ జాతీయులతో పాటు ఇతర దేశాల వారున్నారు. ఘటన అనంతరం భారీ గాలింపు చేపట్టగా సముద్ర గర్భంలో విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తొలుత దీన్ని ఉగ్రదాడిగా ఈజిప్టు అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రముఠా ప్రకటనలు చేయలేదు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల ఆకృత్యాలు.. 400 లైంగిక దాడి కేసులు