పాకిస్థాన్‌లోని ఓ బొగ్గుగని వికేంద్రీకరణ విషయంలో రెండు గిరిజన తెగల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఉత్తర వాయువ్య ప్రాంతంలోని సన్నీఖేల్, జర్ఘున్ ఖేల్ తెగలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ గొడవల్లో దాదాపు 16 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. కోహట్ జిల్లాలోని దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో ఘటన జరిగింది.
బొగ్గుగని వికేంద్రీకరణపై గత రెండు సంవత్సరాలుగా సన్నీఖేల్, జర్ఘున్ ఖేల్ గిరిజన తెగల మధ్య వివాదం నడుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ సోమవారం ఈ వివాదం గొడవలకు దారితీసిందని వారు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని ఘర్షణలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. క్షతగాత్రులను, మృతులను పెషావర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
హాస్టల్‌లో అగ్నిప్రమాదం..
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లోని హాస్టల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో.. ప్రమాదంపై తమకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. వెంటనే అత్యవసర సహాయక సిబ్బందిని అక్కడికి తరలించినట్లు వారు వెల్లడించారు. అనంతరం మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. హోటల్ మొత్తం 52 మంది ఉన్నట్లు సమచారం. అయితే 20 మంది ఆచూకీ లభించలేదని అధికారులు వివరించారు. ఘటనకు గల కారణాల తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు వెల్లడించారు.
అమెరికాలో కాల్పులు..
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫర్మింగ్టన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. న్యూ మెక్సికో కమ్యూనిటీ సమీపంలో కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు సహా పలువురు గాయపడ్డారు.
అయితే కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు మట్టుబెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. దుండగుడు కాల్పులకు తెగించడానికి గల కారణాలు తెలియరాలేదని వారు వెల్లడించారు. కాల్పుల్లో చనిపోయిన వారి పేర్లను కూడా పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో పాఠశాలలను మూసివేయించారు అధికారులు.
మాల్లోకి చొరబడి దుండగుడి కాల్పులు..
పది రోజుల క్రితం కూడా అమెరికా కాల్పులు కలకలం రేపాయి. డల్లాస్ శివారులోని ఓ మాల్లో చొరబడ్డ దుండగుడు అనేక మందిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితుడు సహా 9 మంది మరణించారు. కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కాల్పుల్లో గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.