China missile interception test: శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ పొందే దిశగా చైనా ముందడుగు వేసింది. మధ్యంతర దశలో (మిడ్‌కోర్స్) ఆ అస్త్రాన్ని నేలకూల్చే యాంటీబాలిస్టిక్ క్షిపణికి (ఏబీఎం) సంబంధించిన సాంకేతిక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇలాంటి ప్రయోగాన్ని డ్రాగన్ చేపట్టడం ఇది ఆరోసారి. ఇది పూర్తిగా రక్షణాత్మక చర్య అని, ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది కాదని చైనా రక్షణ శాఖ తెలిపింది. ప్రయోగ లక్ష్యాలన్నీ నెరవేరాయని పేర్కొంది. గత ఏడాది ఫిబ్రవరిలోనూ డ్రాగన్ ఇలాంటి పరీక్షను నిర్వహించింది. తమ క్షిపణి విధ్వంసక వ్యవస్థ విశ్వసనీయతను ఈ ప్రయోగాలు రుజువు చేస్తున్నాయని చైనా సైనిక నిపుణుడొకరు తెలిపారు. ఇది దేశ రక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.
'మిడ్‌కోర్స్'లో ఢీ కీలకం: సాధారణంగా మధ్యంతర దశలో శత్రు క్షిపణిని ఢీ కొట్టించడం కష్టం. ఆ స్థితిలో అది భూవాతావరణాన్ని దాటి చాలా దూరం వెళుతుంది. వేగమూ ఎక్కువగానే ఉంటుంది. బూస్ట్ దశలో ఉన్న బాలిస్టిక్ క్షిపణిని నేలకూల్చడం తేలిక. ఎందుకంటే అది నేల నుంచి చాలా తక్కువ ఎత్తులోనే ఉంటుంది. పైగా పూర్తిస్థాయి వేగాన్ని అందుకోదు. ఆ దశలో క్షిపణిని నిలువరించాలంటే.. దాన్ని ప్రయోగించిన ప్రదేశానికి చేరువగా వెళ్లి, నిరోధక అస్త్రాన్ని సంధించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతం అంత సులువుగా వేరే దేశాలకు అందుబాటులో ఉండదు.
టెర్మినల్ దశలో డైవింగ్ చేసుకుంటూ వెళ్లే క్షిపణి అత్యంత వేగంగా దూసుకెళుతుంది. అందువల్ల ఆ దశలోనూ దాన్ని ఢీ కొట్టడం కష్టం. ఇప్పుడు అనేక దేశాలు హైపర్‌సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. వాటిలో వేవ్ రైడర్ గ్లైడర్లు ఉంటున్నాయి. అవి భూ వాతావరణంలోకి ప్రవేశించాక తమ ప్రయాణ మార్గాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఫలితంగా టెర్మినల్ దశలో వాటిని అడ్డుకోవడం మరింత కష్టమవుతోంది. అందువల్ల మధ్యంతర దశలోనే శత్రు క్షిపణిని అడ్డుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు.. మళ్లీ ఎన్నికలు.. మూడేళ్లలో ఐదోసారి