Avalanche In Gilgit Baltistan : పాకిస్థాన్‌లో భారీ హిమపాతం సంభవించింది. గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో నొమాడిక్ ఆదివాసీ తెగకు చెందిన ముగ్గురు మహిళలతో సహా 10 మంది మృతి చెందారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గుజ్జర్ కుటుంబానికి చెందిన కొంత మంది తమ పశువులతో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అస్టోర్కు ప్రయాణిస్తుండగా పర్వత ప్రాంతమైన షంటర్ టాప్ ప్రదేశంలో హిమపాతం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలతో సహా 10 మంది అక్కిడికక్కడే మృతి చెందారు. 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Avalanche Rescue Operation : సహాయక చర్యలు చేపట్టడానికి రెస్క్యూ బృందాలతో పాటు పాక్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. అందుకోసం ఉత్తర ప్రాంతాల కమాండ్ ఆధ్వర్యంలో ఓ మిలిటరీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మీ హెలికాప్టర్ సేవలను, రిలీఫ్ స్టాఫ్‌ను, పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు వెల్లడించారు.
అస్టోర్ జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. జిల్లా ఆస్పత్రితో సహా స్కార్దు మిలిటరీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై గిల్గిట్-బాల్టిస్థాన్ ఛీప్ సెక్రటరీ స్పందించారు. ఘటనా ప్రాతంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని ఆయన తెలిపారు.
Shehbaz Sharif Avalanche : హిమపాతం కారణంగా జరిగిన ప్రాణనష్టంపై గిల్గిట్-బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖలీద్ ఖుర్షీద్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ప్రారంభించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. హిమపాతంలో 10 మంది ప్రాణాలు కోల్పోవడంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 'వాతావరణ మార్పుల ప్రభావాల వల్ల పాకిస్థాన్‌లో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఇలాంటి దుర్ఘటనల నుంచి రక్షించడానికి ప్రపంచం మొత్తం తన బాధ్యతను నిర్వర్తించవలసి ఉంది" అని షెహబాజ్ అన్నారు.