కరోనా, ఇతర వ్యాధులకు తక్కువ ఖర్చులో చాలా వేగంగా ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు, ఔషధాలు తయారు చేయడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు నూతన విధానాలను తెరపైకి తెచ్చారు. కరోనాలో కొత్త వేరియంట్లు, భవిష్యత్ మహమ్మారుల కట్టడికి ఇవి దోహదపడనున్నాయి. షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
'ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో అద్భుతాలు చేయవచ్చని కొవిడ్ టీకాలు రుజువు చేశాయి. వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీకి పట్టే సమయాన్ని ఏళ్ల నుంచి నెలలకు తగ్గించే సత్తాను ఈ పరిజ్ఞానం చాటింది' అని పరిశోధనకు నాయకత్వం వహించిన జోల్టాన్ కిస్ తెలిపారు. దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్ మహమ్మారులు, ఇతర వ్యాధుల కట్టడికి కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆర్‌ఎన్‌ఏ ఆధారిత చికిత్సల సంఖ్యను పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పాదక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అంతిమంగా ఈ సౌకర్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ దిశగా షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేశారు.
భవిష్యత్‌లో ఏర్పాటయ్యే నెట్‌వర్క్‌కు ఇది కేంద్రబిందువుగా ఉంటుంది. దీని ద్వారా కొత్త వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తారు. మహమ్మారులు లేని సమయాల్లో క్యాన్సర్, జీవక్రియకు సంబంధించిన రుగ్మతలు, హృద్రోగాలు, రోగ నిరోధక వ్యవస్థతో ముడిపడిన వ్యాధులకు కొత్త టీకాలు, ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇందుకు అవసరమైన అధునాతన పరిజ్ఞానం ఇందులో సిద్ధంగా ఉంటుంది. వెల్‌కమ్ ట్రస్టుకు సంబంధించిన 'ఆర్3' కార్యక్రమం కింద దీన్ని చేపడుతున్నారు.
ఇదీ చూడండి: 'ఒమిక్రాన్ తీవ్రత.. డెల్టా కంటే తక్కువే అని చెప్పలేం!'