Russia Ukraine crisis: దేశంపై దండయాత్ర చేపట్టేందుకు సరిహద్దుల్లో రష్యా సైన్యం కాచుకొని ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తమ పౌరులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ ఎవరికీ భయపడేది లేదని అన్నారు. శాంతి చర్చలను బేఖాతరు చేసి రష్యా.. ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోందని మండిపడ్డారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వంపై తాము వెనకడుగు వేసేదే లేదని తేల్చిచెప్పారు.
Ukraine president Nation address
తూర్పు ఉక్రెయిన్‌కు చెందిన రెండు వేర్పాటువాద ప్రాబల్య ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించి, అక్కడికి రష్యా తన సైన్యాన్ని పంపించిన నేపథ్యంలో మాట్లాడారు జెలెన్స్కీ. దౌత్య మార్గాల్లో సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ రష్యా ఇందుకు సహకరించడం లేదని పేర్కొన్నారు.
Ukraine President on Russia
"శాంతియుత, దౌత్యపరమైన మార్గానికి మేం కట్టుబడి ఉన్నాం. మేం ఆ మార్గాన్ని మాత్రమే అనుసరిస్తాం. మేం మా సొంతగడ్డపై ఉన్నాం. ఇతరులెవరికీ, దేనికీ భయపడం. ఇతరుల నుంచి మేం వేటినీ (ప్రాంతాల ఆక్రమణ ఉద్దేశించి) కోరుకోవడం లేదు. మా నుంచి ఇతరులకు ఏమీ ఇచ్చేది లేదు. మా భాగస్వామ్య దేశాల నుంచి స్పష్టమైన, సమర్థవంతమైన చర్యలను ఆశిస్తున్నాం. ఎవరు నిజమైన మిత్రులో, ఎవరు మాటలతోనే సరిపెడతారో తెలుసుకోవాలని అనుకుంటున్నాం."
-వొలొదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇక్కడ శాంతి నెలకొల్పేందుకు సైనిక దళాలను పంపించాలని రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డొనెట్స్క్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాల మోహరింపు జరిగినట్లు తెలుస్తోంది. సైనిక పరికరాలు, ఆయుధ సంపత్తి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇదీ చదవండి: రష్యా చర్యపై ప్రపంచదేశాలు ఆగ్రహం.. ఆంక్షలు విధించిన అమెరికా