ప్రపంచంలోనే తొలి కరోనా టీకాను ఆవిష్కరించిన రష్యా.. వచ్చే సంవత్సరం జనవరి 1న ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ఉటంకిస్తూ స్థానిక మీడియా కథనం ప్రసారం చేసింది.
ఉపాధ్యాయులు, వైద్య సేవల సిబ్బందికి తొలుత ఈ వ్యాక్సిన్ను అందించనున్నట్లు ఆ దేశ వైద్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో పేర్కొన్నట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గమలేయా పరిశోధనా సంస్థ, బిన్నోఫార్మ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలను టీకా ఉత్పత్తి కోసం ఉపయోగించుకోనున్నట్లు మురాష్కో స్పష్టం చేసినట్లు తెలిపింది.
"దశలవారిగా ప్రజలకు టీకా అందుబాటులోకి తీసుకొస్తాం. మొట్టమొదట వైద్య కార్యకర్తలకు టీకా వేయాలనుకుంటున్నాం. పిల్లల ఆరోగ్యానికి భద్రత వహించే ఉపాధ్యాయులకు కూడా ఇవ్వాలనుకుంటున్నాం."
-మిఖాయిల్ మురాష్కో, రష్యా వైద్య శాఖ మంత్రి
మరోవైపు, వ్యాక్సిన్ కోసం 20 దేశాలు తమను సంప్రదించినట్లు 'రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి' హెడ్ కిరిల్ దిమిత్రియేవ్ తెలిపారు. వంద కోట్ల డోసుల కోసం ఆయా దేశాల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు చెప్పారు. ఐదు దేశాల్లోని భాగస్వామ్య సంస్థలతో 50 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి- రష్యా 'కరోనా వ్యాక్సిన్' విడుదల