మానవాళి ఉమ్మడి శత్రువైన భూతాపానికి కళ్లెం వేసి, పుడమిని కాపాడుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలన్న వినతుల మధ్య (Glasgow Cop26) ఐరాస వాతావరణ సదస్సు (కాప్26) ఆదివారం ప్రారంభమైంది. నవంబరు 12 వరకు జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్‌లోని గ్లాస్గో నగరం వేదికైంది. దాదాపు 200 దేశాల నేతలు, ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. వాతావరణ మార్పులను అదుపు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై (Glasgow Cop26) ఈ సమావేశాల్లో చర్చిస్తారు. సోమ, మంగళవారాల్లో జరిగే ప్రారంభ సదస్సుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా ప్రపంచ దేశాల నేతలు పాల్గొంటున్నారు. వాతావరణానికి హాని కలిగిస్తున్న గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు చేపట్టబోయే కసరత్తు గురించి వారు వెల్లడిస్తారు.
వాతావరణ సదస్సు లాంఛనంగా ప్రారంభమైనట్లు (Glasgow Cop26) కాప్26 అధ్యక్షుడు, బ్రిటన్ మంత్రి ఆలోక్ శర్మ ప్రకటించారు. అంతకుముందు.. కొవిడ్-19తో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించేందుకు.. ప్రతినిధులు ఒక నిమిషం మౌనం పాటించారు. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించనివ్వకుండా చూడాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు మనకు ఈ సదస్సే 'చివరి అత్యుత్తమ ఆశ' అని ఆలోక్ శర్మ (Glasgow Cop26) ఈ సంరద్భంగా పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సజీవంగా ఉంచుకునేందుకు సమయం మించిపోతోందన్నారు. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే ప్రపంచం ఇప్పటికే 1.1 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "చర్చలను మనం ముందుకు నడిపించాలి. వచ్చే దశాబ్ద కాలం ఆకాంక్షలు, చర్యలతో సాగేలా చూడాలి. హరిత వ్యవస్థ వృద్ధిలో అపారంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని శర్మ కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య కారక దేశంగా ఉన్న చైనా.. తన వాతావరణ లక్ష్యాలను కొంత మేర పెంచిందన్నారు. ఆ దేశం నుంచి ఇంకా ఎక్కువ ఆశించామని తెలిపారు. మరోవైపు ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. వాతావరణ మార్పులకు తీవ్రంగా నష్టపోయే యువత స్వరాన్ని ప్రపంచ నేతలు ఆలకించాలని బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ ఆదివారం రోమ్‌లో కోరారు.
లక్ష్యాలను వెల్లడించనున్న మోదీ
సోమ, మంగళవారాల్లో జరిగే ప్రపంచ నేతల సదస్సు (డబ్ల్యూఎల్‌ఎస్)లో ప్రధాని మోదీ సహా 120కిపైగా దేశాల ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు పాల్గొంటారు. సోమవారం సాయంత్రం కాప్26 సదస్సును (Glasgow Cop26) ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఇందులో ఆయన భారత కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నారు. "పునరుత్పాదక ఇంధన స్థాపక సామర్థ్యం విషయంలో భారత్ చాలా ముందంజలో ఉంది. వాతావరణ కార్యాచరణలో మన విజయాలను ఈ సదస్సులో వివరిస్తా. కార్బన్ స్పేస్‌ను పంచుకోవడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆర్థిక సాయం, భూతాపాన్ని తట్టుకునే చర్యలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పర్యావరణ అనుకూల జీవన విధానాలు వంటి అంశాలను ప్రస్తావిస్తా" అని మోదీ అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపారు.
సౌరశక్తి కోసం జీజీఐ
ప్రపంచంలోని వివిధ దేశాలను అనుసంధానిస్తూ కొత్తగా 'గ్రీన్ గ్రిడ్స్ ఇనీషియేటివ్' (జీజీఐ)ను భారత్, బ్రిటన్‌లు మంగళవారం ప్రారంభించనున్నాయి. సౌర విద్యుత్ బదిలీకి ఇది వీలు కల్పిస్తుందని అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ) డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ ధరలు తగ్గుతాయన్నారు.
హిమానీ నదానికి గ్లాస్గో పేరు
అంటార్కిటికాలో 100 కిలోమీటర్ల పొడవైన ఒక హిమానీనదానికి 'గ్లాస్గో గ్లేషియర్' అని బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇది వేగంగా కరిగిపోతోంది. దాని పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను గుర్తు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం గ్లాస్గోలో తెలిపారు.
ఇదీ చూడండి : 'డబ్ల్యూహెచ్ఓ బలోపేతానికి జీ20 దేశాల అంగీకారం'