అన్ని దేశాలను హడలెత్తిస్తోన్న కరోనా వైరస్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. కరోనా.. మనతోపాటు జీవించేందుకు అవకాశం ఎక్కువ ఉందని సంస్థ ఎమర్జెన్సీస్ చీఫ్ మైఖేల్ ర్యాన్ వెల్లడించారు.
"వైరస్ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లే అవకాశం లేదు. కరోనా బారిన పడినవారి సంఖ్య ఇప్పటివరకు చాలా తక్కువే. వ్యాక్సిన్ లేకపోతే ఈ వ్యాధికి రోగ నిరోధక శక్తి సంపాదించుకునేందుకు ఏళ్ల సమయం పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది."
- మైఖేల్ ర్యాన్, డబ్ల్యూహెచ్ఓ
గతంలో వచ్చిన హెచ్ఐవీ తరహా నావెల్ వ్యాధులు ఇప్పటికీ అంతం కాలేదని.. కానీ అత్యుత్తమ చికిత్స విధానాలు రూపొందించుకోగలిగామని ర్యాన్ అన్నారు. కరోనా వైరస్‌కు కూడా ఇలాగే జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అయితే కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయగలమని ర్యాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి, ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలన్నారు.
ఇదీ చూడండి: డబ్ల్యూహెచ్‌ఓను బెదిరించిన చైనా- అసలేం జరిగింది?