జీ20 శిఖరాగ్ర సదస్సు(g20 summit 2021) ముగింపు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు అగ్ర దేశాధినేతలు. ఈ శతాబ్దం అర్ధభాగం నాటికి కర్బన ఉద్గారాలను తటస్థీకరించాలన్న ఒప్పందానికి ఆమోదం తెలిపారు. విదేశాల్లోని బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి ఆర్థిక సాయం చేయకూడదని ఏకాభిప్రాయానికి వచ్చారు.
వాతావరణ మార్పులపై(climate change) పేద దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందించాలనే గతంలోని నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు జీ20 దేశాధినేతలు పునరుద్ఘాటించారు. కర్బన ఉద్గారాలను తటస్థీకరించేందుకు తమ చర్యలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే.. దేశీయంగా బొగ్గు వాడకాన్ని తగ్గించే విషయంపై ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదు. ఇది బొగ్గుపై అధికంగా ఆధారపడే చైనా, భారత్ వంటి దేశాలకు ఉపకరించనుంది. గ్లాస్గో సమావేశానికి ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారని అనుకున్న బ్రిటన్కు ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ప్రపంచంలోనే కర్బన ఉద్గారాలను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాల్లో జీ20 దేశాలే(g20 countries) మూడో వంతు ఉన్నాయి.
రెండోరోజు సమావేశానికి ముందు కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పులపై(climate change) కీలక సూచనలు చేశారు ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి.
" పర్యావరణ మార్పులపై దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, అలాగే స్వల్పకాలిక మార్పులకు శ్రీకారం చుట్టాలి. బొగ్గు వినియోగాన్ని ఆపటం, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడుల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉన్న వనరులను మనం తెలివిగా ఉపయోగిస్తున్నామని నిర్ధరించుకోవాలి. అలాగే.. మన సాంకేతికతను, జీవనశైలిని ఈ కొత్త ప్రపంచానికి అనుగుణంగా మార్చుకోగలగాలి."
- మారియో డ్రాఘి, ఇటలీ ప్రధాని.
ఇదీ చూడండి: '2022 చివరి నాటికి భారత్లో 500 కోట్ల టీకా డోసుల ఉత్పత్తి'