అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని(Taliban Government) తాలిబన్లు ఈనెల 7న ప్రకటించగా మంత్రిమండలి కూర్పు మొత్తం పాకిస్థాన్ కన్నుసన్నల్లో జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ సూచించిన వారికే.. కీలక మంత్రి పదవులు దక్కినట్లు సమాచారం. ఈ మంత్రుల ఎంపికలో ఐఎస్ఐ చీఫ్ జోక్యం చేసుకోవటం తాలిబన్లలో(Afghanistan Taliban) ఒక వర్గానికి, పాకిస్థాన్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఓ ఆడియో వైరల్ అయింది. ఇందులో తాలిబన్ కమాండర్, తన సహచరులతో పాకిస్థాన్ అంతర్జాతీయంగా అఫ్గాన్ ప్రతిష్ఠను నాశనం చేస్తోందన్న మాటలు వినిపించాయి.
ఐఎస్ఐ చీఫ్ అఫ్గాన్ పర్యటనతో..
తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు నడుస్తున్న సమయంలో ఐఎస్ఐ చీఫ్ ఫియాజ్ హమీద్ స్వయంగా అఫ్గానిస్థాన్ వెళ్లారు. హక్కానీ నెట్ వర్క్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ, క్వెట్టా శూరాలను మంత్రులుగా నియమించాలని ఆయన ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. తాలిబన్ల సైన్యంపై పట్టున్నవారితో మిలిటరీ ప్రభుత్వం ఏర్పాటైతే.. పాకిస్థాన్ ఐఎస్ఐ నేరుగా అఫ్గాన్ వ్యవహారాలలో జోక్యం చేసుకునే అవకాశం లభిస్తోంది. అందుకే ఐఎస్‌ఐ అధినేత పావులు కదిపినట్లు తెలుస్తోంది. అన్నివర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నా ఐఎస్‌ఐ చీఫ్ జోక్యంతో అది సాధ్యపడలేదని తాత్కాలిక ప్రభుత్వ ఉప రక్షణ శాఖ మంత్రి ముల్లా ఫాజిల్ పంజాబ్ అతిథి దగ్గర ప్రస్తావించిన మాటలు ఈ ఆడియోలో వెలుగు చూశాయి.
ఇరు వర్గాల్లో విభేదాలు..
తాలిబన్లలోని అబ్దుల్ ఘనీ బరాదర్ వర్గం దేశంలో ఉన్న సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, యూదులు వంటి మైనార్టీలతో పాటు పాత నాయకుల్ని కూడా ప్రభుత్వంలో చేర్చుకోవాలని భావించింది. హక్కానీ వర్గం దీనిని ఏ మాత్రం ఇష్టపడకపోవటం వల్ల ఇరు వర్గాల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ ఆదేశాల మేరకు సిరాజుద్దీన్ హక్కానీకి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇది అంతర్జాతీయ సమాజంలో విమర్శలకు తావిచ్చింది. ఫేస్‌బుక్‌లో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఈ ఆడియోను ఆ తరువాత తొలగించారు.
ఇవీ చూడండి: Taliban Government: అఫ్గాన్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వాయిదా