వ్యూహాత్మక భద్రతా లక్ష్యాలకు అనుగుణంగా అఫ్గానిస్థాన్‌తో పాకిస్థాన్(Pak Taliban) వ్యవహరిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. అఫ్గాన్‌పై భారత్ ప్రభావం తగ్గించే విధంగా తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిచర్చలు జరుపుతూనే ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం త్రైమాసిక నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఈ నివేదిక ప్రకారం అఫ్గాన్‌లో పౌరయుద్ధం వస్తే తమపై తీవ్ర ప్రభావం పడుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. దీనివల్ల తమ దేశంలో అస్థిరత నెలకొనడమే గాక, అఫ్గాన్ శరణార్థులు సరిహద్దులకు భారీగా తరలివస్తారని, పాక్ వ్యతిరేక ఉగ్రవాదులు బలపడుతారని భావిస్తోంది. అందుకే తాలిబన్లకు మద్దతుగా ఉంటోందని నివేదిక పేర్కొంది.
గతంతో పోల్చితే అఫ్గాన్ తాలిబన్లకు(Afghan taliban) పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక సహకారం పెరిగిందని అమెరికా నివేదిక వెల్లడించింది. ఒకప్పుడు మసీదుల నుంచి వసూళ్లకు పాల్పడే తాలిబన్లు ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాల్లో యథేఛ్ఛగా వసూళ్లు చేస్తున్నారని పేర్కొంది. ఒక్కో దుకాణం నుంచి 50 డాలర్ల వరకు అందుతున్నట్లు తెలిపింది. క్వెట్టా, కచ్లక్ బైపాస్, పష్తున్ అబాద్, ఇషాక్ అబాద్, ఫరూకియా వంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది.
బలగాల ఉపసంహరణ స్వాగతించిన ఇరాన్..
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణను ఇరాన్ స్వాగతించినట్లు అమెరికా నివేదిక పేర్కొంది. అయితే ఫలితంగా ఆ దేశంలో ఏర్పడిన అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను మాత్రం ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: Afghanistan Taliban: విదేశీ సైనికుల ఒడిలో 'అఫ్గాన్' పసికందులు