అఫ్గానిస్థాన్ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో 967మంది తాలిబన్లను అఫ్గాన్ సైన్యం మట్టుబెట్టింది. మరో 500 మందికిపైగా తాలిబన్లను గాయపరిచింది. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోతున్న తరుణంలో ఆ దేశంలోని కీలక ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో 20 రాష్ట్రాలు, 9 నగరాల్లో సైన్యానికి, ప్రజలకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు.
మరోవైపు.. పర్వాన్లోని సోర్క్-ఏ-పార్సా జిల్లా, ఘజ్నీలోని మెయిల్స్థాన్ జిల్లాను అఫ్గాన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని ఆ దేశ మధ్యవర్తిత్వ శాఖ తెలిపింది. అయితే.. నిమ్రోజ్లోని ఛఖాన్సుర్ జిల్లాను మాత్రం తాలిబన్లు ఆక్రమించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు 967మంది తాలిబన్లను మట్టుబెట్టామని అఫ్గాన్ సైన్యం ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు.
ప్రజలపై దాడులు..
తాఖర్ ప్రావిన్సులోని తుల్కాన్ నగర శివారులో పెద్ద ఎత్తున ఘర్షణలు జరగుతున్నాయి. తాలిబన్లు తమ నగరంపై రెండు వారాలుగా దాడులకు దిగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "రోజురోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. షాపులు అన్ని మూతపడ్డాయి. ఇళ్లపై తాలిబన్లు మోర్టార్లతో దాడులకు దిగుతున్నారు" అని తుల్కాన్ నగరానికి చెందిన అబ్దుల్ కరీమ్ అనే వ్యక్తి తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కుందుజ్ నగరవాసులు కూడా తమపై తాలిబన్లు దిగుతున్నారని చెప్పారు.
"కుందుజ్ నగరంలో నంబర్ 1 ప్రాంతంలో మా ఇల్లు ఉంది. మా ఇంటిపై మోర్టార్ దాడి జరిగింది. దాంతో మేము అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లిపోయాం. మా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు."
-ఫర్జానా, కుందుజ్ నగరవాసి.
చర్చల్లో కనిపించని పురోగతి!
మరోవైపు.. అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులు, తాలిబన్ల మధ్య ఖతార్ రాజధాని దోహాలో శనివారం ప్రారంభమైన చర్చలు ఆదివారం కూడా కొనసాగాయి. అయితే తాలిబన్లు ఓ వైపు ప్రభుత్వ దళాలపై దాడులు చేస్తూ, కీలక ప్రాంతాలను ఆక్రమిస్తున్న నేపథ్యంలో చర్చల పురోగతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ నాయకుడు హైబతుల్లా అఖుంద్‌జాదా కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక పరంగా తాము ముందంజలో ఉన్నా.. తమకు రాజకీయ పరిష్కారమే కావాలని తెలిపారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ వ్యవస్థను స్థాపించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ చర్చల్లో ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్టులో ఉంచిన 7,000 మంది పేర్లను తొలగించాలని తాలిబన్లు పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: