అప్గానిస్థాన్ గడ్డపై రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రకటించారు. తాను ఇంకా ప్రతిఘటించి ఉంటే అనేక మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తాలిబన్ల విజయాన్ని అంగీకరించిన ఆయన దేశ రక్షణ ఇక వారి బాధ్యతేనని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ అధికారిక ఖాతాలో ఓ సందేశం ఉంచారు.
రక్తపాతాన్ని నివారించేందుకే..
"దేశ ప్రజలారా..! ఈరోజు నేను ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గత 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నా దేశాన్ని వీడడం.. లేక అధ్యక్ష భవనంలోకి ప్రవేశించాలనుకుంటున్న సాయుధ తాలిబన్లను ఎదుర్కోవటం అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే నా ముందున్నాయి. ఇంకా అనేక మంది దేశ ప్రజలు అమరులవ్వటం, కాబుల్ నగరం విధ్వంసం కావటం.. ఈ పరిణామాలు అతిపెద్ద మానవ సంక్షోభాన్ని మిగులుస్తాయి. తాలిబన్లు నన్ను దించేయాలని నిర్ణయించుకున్నారు. కాబుల్ నగరాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. ఈ ఘోర రక్తపాతాన్ని నివారించటం కోసమే నేను దేశం వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నాను"
-- అప్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
భయాందోళనలో ప్రజలు
"తాలిబన్లు విజయం సాధించారు. దేశ ప్రజల అస్థిత్వాన్ని, గౌరవాన్ని, సంపదను కాపాడాల్సిన బాధ్యత ఇక వారిదే. వారు చట్టబద్ధంగా ప్రజల హృదయాలను గెలుచుకోలేకపోయారు. వారిప్పుడు ఓ చరిత్రాత్మక పరీక్షను ఎదుర్కోబోతున్నారు. అఫ్గానిస్థాన్ పరువు ప్రతిష్ఠలను కాపాడతారా? లేక అసాంఘిక శక్తులకు ఆశ్రయమిస్తారా? అఫ్గాన్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. తమ భవిష్యత్తుపై వారికి భరోసా లేదు. అఫ్గాన్ ప్రజలతో పాటు వివిధ దేశాలకు తాలిబన్లు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అఫ్గాన్ సోదరీమణుల హృదయాలను చట్టబద్ధంగా గెలుచుకోవాల్సి ఉంది. దానికోసం ఓ పక్కా ప్రణాళికను రూపొందించండి. దాన్ని ప్రజలకు బహిర్గతం చేయండి. దేశాభివృద్ధి కోసం నేను నా కృషిని కొనసాగిస్తూనే ఉంటాను. అఫ్గానిస్థాన్ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ అష్రఫ్ ఘనీ తన సందేశాన్ని ముగించారు.
అఫ్గాన్ రాజధాని కాబుల్ సమీపంలోకి శనివారం నాటికే వచ్చేసిన తాలిబన్లు.. ఆదివారం దాని శివార్లలోకి చేరుకున్నారు. అన్నివైపుల నుంచీ నగరాన్ని చుట్టుముట్టారు. అయితే తమ సహజ స్వభావానికి విరుద్ధంగా శాంతిమంత్రం జపించారు. ఎక్కడా విధ్వంసానికి తెగబడలేదు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నుంచి శాంతియుతంగా అధికారాన్ని దక్కించుకోవాలని భావించారు. షరతులేవీ విధించకుండా ప్రభుత్వం తమకు లొంగిపోవాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా చర్చలు జరిపేలా.. తమ రాయబారులను అధ్యక్షుడి భవనానికి పంపించారు. ప్రభుత్వం తరఫున అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, జాతీయ రాజీ మండలి (ఎన్‌ఆర్‌సీ) అధినేత అబ్దుల్లా చర్చల్లో పాల్గొన్నారు.
అనంతరం దేశాధ్యక్ష భవనంలోకి తాలిబన్ ఫైటర్లు ప్రవేశించారు. దీంతో అఫ్గాన్ పూర్తిగా తాలిబన్ల వశమైంది. ఆ వెంటనే అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం తన బృందంతో కలిసి తజకిస్థాన్ చేరుకున్నారని సమాచారం.
ఇదీ చూడండి: దేశాన్ని వీడిన అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ!