ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి(Covid In Worldwide) వణికిస్తూనే ఉంది. వైరస్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు వివిధ దేశాలు కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి. ఒలిపింక్స్‌కు ఆతిథ్యమిచ్చిన జపాన్‌లో కరోనా కట్టడికి కోసం టోక్యోతో మరో 18 ప్రాంతాల్లో విధించిన అత్యయిక స్థితిని(Tokyo Emergency) ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. తమ దేశంలో కొత్త కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం తగ్గలేదని చెప్పింది.
వైరస్‌తో తీవ్ర అనారోగ్యంపాలైన వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు జపాన్ ప్రధాని యోషిహిదే సుగా తెలిపారు. ఆస్పత్రుల్లో చేరికలు కూడా అధికంగా ఉన్నాయని చెప్పారు. "ప్రజలంతా భౌతిక దూరం పాటించాలి. అప్పుడే మనం మళ్లీ సురక్షితమైన జీవితాలను పొందగలం" అని ఆయన అన్నారు.
అక్కడి ప్రజలకు ఊరట..
ఆస్ట్రేలియాలోని(Australia Corona Updates) న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన.. లాక్‌డౌన్‌ను శనివారం అక్కడి అధికారులు ఎత్తివేయనున్నారు. 16 ఏళ్ల వయసు దాటిన వారిలో 70శాతం మందికి రెండు డోసుల టీకా అందితే.. సిడ్నీలో కరోనా ఆంక్షలను సడలించేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. జూన్ నుంచి సిడ్నీ నగరం లాక్‌డౌన్‌లోనే ఉంది.
సిడ్నీ తీర ప్రాంతాలైన.. ముర్రుమ్బ్రిడ్జి, రివెరినా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను అక్కడి అధికారులు ఎత్తివేశారు. ఇప్పటివరకు న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో 16 ఏళ్లు వయసు దాటిన 43శాతం మందికి టీకా రెండు డోసులు అందించారు.
న్యూజిలాండ్‌లో టీకాలతో...
కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధించిన న్యూజిలాండ్ ప్రభుత్వం(New Zealnad Coronacases).. తమ ప్రజలను వైరస్ ముప్పు నుంచి తప్పించేందుకు.. టీకా పంపిణీ వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా స్పెయిన్ నుంచి 2,50,000 డోసులను కొనగోలు చేస్తోంది. ఈ టీకాలు శుక్రవారం న్యూజిలాండ్‌కు చేరుకుంటాయని ఆ దేశ ప్రదాని జెసిండా ఆర్డెన్ తెలిపారు.
ఇప్పటికే న్యూజిలాండ్‌లో 55శాతం మంది వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఆ దేశంలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గురువారం కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ.. ఆక్లాండ్ నగరంలో ఇంకా లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయినప్పుడే.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
ప్రపంచ దేశాల్లో.
ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,98,952 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 9,754 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 223,381,096కు చేరగా.. మరణాల సంఖ్య 4,608,897కు పెరిగింది.
కొత్త కేసులు ఇలా..
- అమెరికా - 1,57,759
- బ్రెజిల్- 14,430
- రష్యా- 18,024
- బ్రిటన్- 38,975
- ఫ్రాన్స్- 18,856
- టర్కీ-23,914
- ఇరాన్-26,854
ఇదీ చూడండి: Booster Vaccine: 'అప్పటివరకు బూస్టర్ డోసులు ఆపండి'
ఇదీ చూడండి: Covid Vaccine: శీతలీకరణ అక్కర్లేని సరికొత్త కొవిడ్ టీకాలు