కరోనాను కట్టడి చేసేందుకు సహాయసహకార మార్గాలపై భారత్, బంగ్లాదేశ్ చర్చించాయి. వైరస్ చికిత్స, టీకాతో సహా కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపైనా ఇరు దేశాల మధ్య చర్చ జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత తొలిసారి బంగ్లాదేశ్‌లో రెండురోజుల పర్యటనకు వెళ్లారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ఇరుదేశాల భద్రతాపరమైన అంశాలు, వ్యాపారులు, అధికారుల ప్రయాణ ఏర్పాట్లకు ప్రతిపాదన, వైద్య పరికరాల రవాణాపైనా చర్చించించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
" ఇరుదేశాల సంబంధాల బలోపేతం, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, కరోనా చికిత్స, వ్యాక్సిన్‌తో సహా కొవిడ్ కట్టడిలో సహకారం, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబ్ రెహ్మాన్ శతజయంతి ఉత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించటం వంటి అంశాలపై చర్చించారు. భారత రైల్వే గత నెల 10 బ్రాడ్‌గేజ్ డీజిల్ లోకోమోటివ్లను బంగ్లాదేశ్‌కు పంపటంపై కృతజ్ఞతలు తెలిపారు హసీనా. త్వరలోనే వర్చువల్‌గా జరగబోయే విదేశాంగ మంత్రుల సమావేశంపైనా ఇరువురు చర్చించారు."
- అధికారవర్గాలు
ఇదీ చూడండి: పాక్ ఆర్మీ చీఫ్‌కు సౌదీలో ఘోర పరాభవం