అమెరికా-చైనా మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. తాజాగా చైనాపై అదనపు చర్యలు చేపట్టడానికి అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది. అయితే ఈ చర్యలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మాత్రం ట్రంప్ సర్కార్ స్పష్టతనివ్వలేదు.
"రానున్న రోజుల్లో చైనాపై చర్యలు చేపడతాం. అయితే అవి ఏమిటనేది మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచే మీరు వింటారు. కానీ నేను ఒకటి చెప్పగలను.. చైనాపై కచ్చితంగా చర్యలు ఉంటాయి."
-- కైలీ మెక్ఎనానీ, శ్వేతసౌధం అధికార ప్రతినిధి.
కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచమంతటా వ్యాప్తిచెందడానికి చైనా తప్పిదాలే కారణమంటూ అనేకమార్లు మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. హాంగ్కాంగ్ జాతీయ భద్రతా బిల్లు, అమెరికా జర్నలిస్టులపై ఆంక్షలు, టిబెట్ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
చైనా ప్రభుత్వంపై విచారణ కోసం..
చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టింది 14 మంది చట్టసభ్యుల బృందం. కరోనా సంక్షోభాన్ని అదనుగా తీసుకుని చైనా ప్రభుత్వం చేస్తున్న దోపిడీని గుర్తించి, విశ్లేషించి, ఎదుర్కోవాలని చట్టసభ్యులు బిల్లులో కోరారు.
"ప్రివెంటింగ్ చైనా ఫ్రం ఎక్స్ప్లాయిటింగ్ కొవిడ్-19 యాక్ట్"ను ప్రవేశపెట్టారు కాంగ్రెస్ సభ్యుడు జారెడ్ గోల్డెన్. కరోనా సంక్షోభాన్ని లబ్ధి చేసుకునేందుకు.. చైనా చేపడుతున్న చర్యలపై డీఎన్ఐ(డైరక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటిలిజెన్స్) దర్యాప్తు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని గోల్డెన్ తెలిపారు. చైనా తీరుతో అమెరికా ఎంత నష్టపోతుందనేది కూడా అంచనా వేయవచ్చన్నారు.
ఇదీ చూడండి- చైనా నిజస్వరూపం బయటపడింది: ట్రంప్