ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ.. బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారు. బాగ్దాదీ తనంతట తాను పేల్చుకుని మరణించాడని తెలిపారు.
" శనివారం రాత్రి ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రసంస్థకు అధిపతి అయిన వ్యక్తిని అమెరికా అంతమొందించింది. అబుబకర్ అల్ బగ్దాదీ హతమయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత కిరాతక ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్‌కు ఇతడు అధిపతి. వాయువ్య సిరియాలో శనివారం రాత్రి అమెరికాకు చెందిన ప్రత్యేక ఆపరేషన్ దళం అత్యంత ప్రమాదకరమైన,సాహసోపేతమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బాగ్దాదీతో పాటు అతడి సహచరులు, స్నేహితులు మృత్యువాతపడ్డారు. ఓ వైపు మూసుకుపోయిన సొరంగంలో ఏడ్చుకుంటూ, పరుగులు పెడుతూ వెళ్లిన బాగ్దాదీ ఆ సొరంగం చివర చనిపోయాడు. తన కుమారులైన ముగ్గురిని తనతోపాటు ఆ సొరంగంలోకి తీసుకెళ్లి వాళ్ల మరణానికి కూడా కారణం అయ్యాడు. అతడు సొరంగంలో చివరికి వెళ్లేసరికి అతడిని మా సైనిక శునకాలు గుర్తించాయి. ఇక తప్పించుకునే దారిలేదని తెలుసుకున్న బాగ్దాదీ తనను తాను పేల్చుకొని తనతో పాటు తన ముగ్గురు పిల్లల్ని కూడా పేల్చివేశాడు. పేలుడు ధాటికి బగ్దాదీ శరీరం తునాతునకలైంది. ఆ తర్వాత జరిపిన వివిధ పరీక్షల ద్వారా ఛిద్రమైన ఆ శరీరం బగ్దాదీగా గుర్తించడం జరిగింది. "
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు